నిజమేనా?: బీజేపీ అధ్యక్షురాలిగా పురందేశ్వరి ఔట్‌?

Chakravarthi Kalyan
ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరిని వైసీపీ లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పిస్తోంది. ఆ పార్టీ బీజేపీపై నేరుగా ఆరోపణలు చేయకుండా పురంధేశ్వరిపై వ్యక్తిగతంగా దూషణలకు దిగుతున్నారు. కారణం ఆమె చంద్రబాబుకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది.  మరోవైపు బీజేపీ అగ్రనాయకత్వానికి టీడీపీతో పొత్తు ఇష్టం లేకపోయినా.. ఈమె ప్రోద్బలంతోనే పొత్తుల చర్చలు జరిగాయని ఆ పార్టీ భావిస్తోంది.

దీంతో ఓ కొత్త ప్రచారాన్ని తెరపైకి తీసుకువచ్చారు. బీజేపీ అధిష్ఠానం ఆమెను ఏపీ బీజేపీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించబోతున్నారు అంటూ వైసీపీ అనుకూల మీడియా ప్రచారం చేస్తోంది. ఆడపిల్ల  అయినా పుట్టినిల్లు బాగును కోరుతుంది. మెట్టినింటి మంచిని కోరుతుంది. కానీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి మాత్రం తిన్నంటి వాసాలు లెక్కపెడుతోంది. అందుకే ఆమెను పదవి నుంచి తీసేయాలని పార్టీ పెద్దలు భావిస్తున్నారు అని రాసుకొచ్చింది.

ఎన్టీఆర్ కుమార్తె అయినా.. ఆమె టీడీపీ లో చేరకుండా కాంగ్రెస్ లో చేరి రెండు సార్లు ఎంపీ గా గెలిచారు. మన్మోహన్ సారథ్యంలో నాటి యూపీఏ ప్రభుత్వ హయాంలో ఆమె కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ ఆంధ్రాలో ఓడిపోవడంతో ఆమె బీజేపీలో చేరారు. పార్టీ రాష్ట్ర పగ్గాలు అప్పజెప్పి బీజేపీని బలోపేతం చేయాలని సూచించింది. కానీ ఆమె మనసోచోట, మనువోచోట అన్నట్లు పురంధేశ్వరి చూపులన్నీ టీడీపీ వైపే ఉన్నాయి. పార్టీ పగ్గాలు చేపట్టిన దగ్గర నుంచి టీడీపీ, బీజేపీ మధ్య సయోధ్య కుదర్చడానికే ఆమె యత్నిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. దీంతో పాటు కొన్ని అనైతిక చర్యలకు పాల్పడ్డారని.. అందుకే హైకమాండ్ ఆమెను పదవి నుంచి తొలగించాలని డిసైడ్ అయిందని రాసుకొచ్చింది.  

అయితే ఈ అంశాన్ని రాజకీయ విశ్లేషకులు కొట్టిపారేస్తున్నారు.  ఎన్నికలకు 50 రోజుల సమయం ఉన్నందున పురంధేశ్వరిని పార్టీ బాధ్యతల నుంచి తప్పించే సాహసం బీజేపీ అధిష్ఠానం చేయదని తేల్చి చెబుతున్నారు. ఆమె మాత్రం పొత్తుల విషయంలో తుది నిర్ణయం అధిష్ఠానానిదే అని చెబుతున్నారు. మేం మాత్రం ఒంటరిగా అన్ని చోట్ల పోటీకి సిద్ధంగా ఉన్నాం అంటూ ప్రకటిస్తున్నారు. కానీ వైసీపీ మాత్రం ఆమెపై వ్యతిరేక ప్రచారం చేస్తూ వస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp

సంబంధిత వార్తలు: