దేశంలో 9000 చోట్ల.. నడిరోడ్డుపై మృత్యుదేవత?

Chakravarthi Kalyan
వాహనాల్లో హైవేలపై రువ్వున దూసుకుపోవడం సరదాగానే ఉంటుంది. కానీ అదే హైవేలపై బ్లాక్ స్పాట్( ప్రమాదకర ప్రదేశాలు) యమ పాశాలుగా మారుతున్నాయి.  దేశంలో అత్యధిక రోడ్డు ప్రమాదాలు హైవే బ్లాక్ స్పాట్ల వద్ద సంభవిస్తున్నాయి. దేశంలో హైవేపై ఐదేళ్లలో బ్లాక్ స్పాట్ల వద్ద ఏకంగా 39,944 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో 18476 మంది దుర్మరణం చెందారు.

ప్రస్తుతం దేశంలో 9000 బ్లాక్ స్పాట్లు ఉన్నాయని జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ ఎన్ హెచ్ఏఐ తమ నివేదికలో వెల్లడించింది. బ్లాక్  స్పాట్లను సరిచేయడానికి ప్రాధాన్యం ఇస్తామని పేర్కొంది. జాతీయ రహదారిపై బ్లాక్ స్పాట్ల ప్రమాదాల నివారించేందుకు ఎన్ హెచ్ఏఐ కార్యచరణను వేగవంతం చేసింది. గుర్తించిన బ్లాక్ స్పాట్లను శాస్త్రీయంగా విశ్లేషించి తగిన చర్యలు చేపడుతుంది. అందుకోసం పోలీసులు, రవాణాశాఖల సమన్వయంతో జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేసింది.

బ్లాక్ స్పాట్లుగా గుర్తించిన ప్రదేశాల్లో జాతీయ రహదారుల విస్తరణ, రోడ్లకు మరమ్మతులు, ప్రమాదాల మలుపు సమయంలో చెట్ల తొలగింపు,  సైన్ బోర్డుల ఏర్పాటు తదితర చర్యలు వేగవంతం చేస్తోంది. ఆ ప్రమాదాల్లో హైవే పెట్రోలింగ్ ను కూడా పెంచింది. గత ఐదేళ్లలో దేశంలో మొత్తం 3972 బ్లాక్ స్పాట్లను సరిచేసింది.  భారతీయ రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ప్రకారం ఏదైనా జాతీయ రహదారి 500 మీటర్ల పరిధిలో గడిచిన మూడేళ్లలో అత్యంత దారుణ ప్రమాదాలు ఐదు జరిగి దానిలో 10మందికి పైగా మరణించిన.. లేదా తీవ్రంగా గాయపడినా దానిని బ్లాక్ స్పాట్ గా గుర్తిస్తారు.

బ్లాక్ స్పాట్లు రోడ్డు ప్రమాదాల మృతుల సంఖ్యలో తమిళనాడు మొదటి స్థానంలో ఉంది. ఆ రాష్ట్రంలో 6230 రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. 2144 మంది దుర్మరణం చెందారు. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే తెలంగాణ నాలుగో స్థానంలో.. ఏపీ ఐదో స్థానంలో ఉన్నాయి. తెలంగాణలో 485 బ్లాక్ స్పాట్లు ఉండగా.. 3965 రోడ్డు ప్రమాదాల్లో 1672 మంది చనిపోయారు. ఏపీలో 466 బ్లాక్ స్పాట్లలో 2202 ప్రమాదాల్లో 1273మంది మృతి చెందారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: