తెలంగాణ నుంచి పోటీకి సోనియా రెడీ?
దేశంలో ఎమెర్జెన్సీ తలెత్తిన సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠ మసకబారింది. ఈ సమయంలో హస్తం పార్టీకి దక్షిణ భారతదేశమే పూర్వ వైభవం తీసుకువచ్చింది. నాటి ప్రధాని ఇందిరాగాంధీ మెదక్ లోక్ సభ నుంచి పోటీ చేసి గెలిచి ఆ పార్టీని కేంద్రంలో అధికారంలోకి తీసుకువచ్చారు. ఇక తాజాగా పదేళ్ల పాటు అధికారానికి దూరమైన కాంగ్రెస్ పార్టీ ఈ సారి ఎలాగైనా గెలవాలని తమ సర్వ శక్తులను ఒడ్దుతోంది.
ఈ సారి కూడా దక్షిణ భారత దేశం నుంచే పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని చూస్తోంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత తొలిసారి కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ గాంధీభవన్ లో సమావేశం అయింది. ఈ మేరకు సోనియా గాంధీని తెలంగాణ నుంచి బరిలో దించాలని తీర్మానం చేసింది. గతంలో ఇందిరాగాంధీ మెదక్ నుంచి పోటీచేసినట్లుగా ఈ సారి కూడా సోనియా గాంధీ కూడా తెలంగాణ బరిలో ఉండాలని తీర్మానించారు.
మరోవైపు కేసీఆర్ కూడా ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నారు. లోక్ సభ ఫలితాల్లో ఆశాజనక స్థానాలు రాకపోతే ఆ పార్టీ గ్రాఫ్ పడిపోయే అవకాశం ఉంది. మరోవైపు ఎక్కువ ఎంపీ స్థానాలు గెలిస్తే కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకత ఉందనే భావన ప్రజల్లో తీసుకురావొచ్చు. అందుకే కేసీఆర్ కూడా మెదక్ బరిలో నిలుస్తారనే ప్రచారం కూడా సాగుతోంది. బీజేపీ కూడా తెలంగాణ పై ఫోకస్ పెట్టిన నేపథ్యంలో వీటన్నింటికి చెక్ పెట్టేలా తెలంగాణ ఇచ్చిన తల్లిగా సోనియాగాంధీని లోక్ సభ బరిలో దించాలని చూస్తున్నారు.