హెరాల్డ్ డిబేట్:ఒకే ఒక్క తప్పు.. హర్షకుమార్‌కు అడ్రస్ లేకుండా చేస్తోందా?!
అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు షాకిచ్చారా? నిన్నమొన్నటి వరకు బాబు తనకు తోడుగా ఉంటారని అనుకున్న హర్షకుమార్.. ఇప్పుడు బాబు నిజస్వరూపం చూసి చలి-జ్వరానికి గురయ్యారా? అంటే.. ఔననే అంటున్నారు తూర్పుగోదావరి జిల్లా రాజకీయ నేతలు. అంతేకాదు, గతంలో అంటే గత ఏడాది ఎన్నికలకు ముందు ఆయన చేసిన ఒకే ఒక తప్పు.. ఆయనకు ఇప్పుడు రాజకీయంగా అడ్రస్ లేకుండా చేసిందని కూడా చర్చించుకుంటున్నారు. ఆది నుంచి కాంగ్రెస్‌లో ఉన్న హర్షకుమార్... గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డిని నమ్ముకున్నారు. ఫలితంగా అమలాపురం పార్లమెంటు టికెట్‌ను వరుసగా తెచ్చుకుని, వైఎస్ ఆశీర్వాదంతో జీవీ విజయం సాధించారు. నిజానికి వైఎస్ రాజకీయాల్లో ఉన్నన్నాళ్లూ.. హర్షకుమార్ దూకుడుగానే ఉన్నారు.
అయితే, వైఎస్ మరణాంతరం.. హర్షకుమార్‌కు రాజకీయంగా అడ్రస్ గల్లంతైందనే చెప్పాలి. 2014 ఎన్నికల్లో ఆయన అప్పటి సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి స్థాపించిన జై సమైక్యాంధ్ర పార్టీలో చేరారు. ఈ క్రమంలోనే ఆ పార్టీ టికెట్‌పై అమలాపురం నుంచి పోటీ చేశారు. తనను తాను ఎక్కువగానే ఊహించుకున్నారు. నియోజకవర్గంలో తనను మించిన నాయకుడు లేడని అనుకున్నారు. మూడోసారి కూడా వరుసగా విజయం తనదేనని భావించారు. కానీ, దారుణాతి దారుణంగా ఓడిపోయారు. కేవలం 9 వేల ఓట్లు మాత్రమే ఆయనకు పోలయ్యాయి. దీంతో డిపాజిట్ కూడా కోల్పోయారు. ఇక, అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్నారు హర్షకుమార్.
తర్వాత కొన్నాళ్లకు మళ్లీ రాజకీయంగా దూకుడు ప్రారంభించారు. ఇంతలోనే ఆయనపై చంద్రబాబు హయాంలో కేసులు నమోదయ్యాయి. ఇదిలావుంటే, వైఎస్సార్ సీపీ నుంచి.. పార్టీలో చేరాలంటూ ఆహ్వానం అందింది. ఈ నేపథ్యంలో వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని జగన్ చెంతకు చేరి ఉంటే.. హర్షకుమార్ పొలిటికల్ లైఫ్ మరో విధంగా ఉండేది. కానీ, ఆయన తాత్సారం చేశారు. జగన్ వాల్యూని పెద్దగా గుర్తించలేకపోయారు. మళ్లీ చంద్రబాబు అధికారంలోకి వస్తారన్న భారీ ప్రచారానికి పడిపోయారు. ఈ క్రమంలో టీడీపీవైపు చూశారు. అయితే, టికెట్ ఇచ్చేందుకు చంద్రబాబు విముఖత వ్యక్తం చేశారు. అమలాపురం టికెట్‌ను దివంగత పార్లమెంటు స్పీకర్ బాలయోగి కుమారుడు హరీష్ మాధుర్‌కు ఇచ్చారు.
ఈ పరిణామాలతో తీవ్ర మనస్థాపానికి గురైన హర్షకుమార్ పోటీకి దూరంగా ఉన్నారు. కానీ, మనసులో మాత్రం రాజకీయాలకు దూరమయ్యాననే ఆవేదన మాత్రం ఆయనలో కనిపిస్తోంది. ఈ క్రమంలోనే గత ఏడాది జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి పార్టీలోకి రావాలని ప్రయత్నించారని అంటారు. కానీ, అప్పటికే హర్షకుమార్ వ్యవహార శైలి జగన్‌కు తెలిసి ఉండడం, సీనియర్లు కూడా హర్షను పెద్దగా ఇష్టపడకపోవడంతో వైఎస్సార్ సీపీలోకి రావాలన్న హర్షకుమార్ కల కలగానే మిగిలిపోయింది. కానీ, ఆయనలో జగన్ తనను పార్టీలోకి చేర్చుకోలేదన్న అక్కసు అయితే అలానే ఉంది. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో ఏదో కారణంగా ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
తాజాగా తూర్పుగోదావరి జిల్లా సీతానగరం పోలీసుస్టేషన్‌లో జరిగిన వరప్రసాద్ శిరోముండనం కేసును అడ్డుపెట్టుకుని రాజకీయంగా దూకుడు ప్రదర్శించాలని హర్షకుమార్ భావించారు. ఈ క్రమంలోనే అన్ని పార్టీలనూ అంటే ప్రధాన ప్రతిపక్షం టీడీపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టులను తన వెంట నిలుపుకొని జగన్‌కు చుక్కలు చూపించాలని భావించారు. ఆయా పార్టీల అధినేతలు, కీలక నాయలకు ఫోన్లు కూడా చేసి బ్రతిమలాడారు. హర్షకుమార్ విజ్ఞప్తికి ముందు ఓకే చెప్పినా.. తర్వాత మాత్రం పార్టీల నాయకులు ఫోన్లు స్విచ్ఛాప్ చేసుకున్నారు. దీంతో హర్షకుమార్ చేసిన నిరసన కేవలం తన ఇంటి వరకు, తన ఒక్కడి వరకు మాత్రమే పరిమితమైంది. దీంతో హర్షకుమార్‌కు ఇప్పుడు కలిసి వచ్చే నేతకానీ, పార్టీకానీ లేకుండా పోయిందనే చర్చ జోరుగా సాగుతుండడం గమనార్హం. మొత్తంగా చూస్తే.. వైఎస్సార్ సీపీలో చేరకుండా చేసిన ఒకే ఒక్క తప్పు.. హర్షకుమార్‌కు అడ్రస్ లేకుండా చేసిందనే చర్చ జోరుగా సాగుతుండడం గమనార్హం.