దేవుడా.. వీడు మనిషేనా: భార్యను చంపి.. ముక్కలుగా నరకాలనుకుని.. గ్యాస్‌ లీక్‌ చేసి..?

Chakravarthi Kalyan
ఏడు అడుగులు వేసిన వాడే ఏడు ముక్కలుగా నరకాలనుకున్నాడు. కట్టుకున్న భార్యను కడతేర్చటమే కాకుండా ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నాలు చేశాడు. ఈ నెల 4న  హైదరాబాద్‌లో జరిగిన ఈ దుర్ఘటన కుటుంబసభ్యుల ఆందోళనతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రకాశం జిల్లా కనకమెట్లకు చెందిన రంగనాయకులు, లక్ష్మీ దంపతుల మూడో కూమార్తె మధులత. ఆమెకు అదే జిల్లా దర్శికి చెందిన పరకాల నాగేంద్ర భరద్వాజ్‌తో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఓ బాబు ఉన్నాడు.

దంపతులిద్దరూ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు. వృత్తిరీత్యా హైదరాబాద్‌లో ఉంటున్నారు. బాచుపల్లిలోని సాయిఅనురాగ్‌ కాలనీలో ఓ ఇంట్లో అద్దెకుంటున్నారు. పెళ్లైన కొంతకాలం బాగానే ఉన్నా.. తర్వాత దంపతుల మధ్య క్రమంగా గొడవలు మొదలయ్యాయి. ఈ నెల 4న భార్యాభర్తల మధ్య మరోసారి గొడవ జరిగింది. విచక్షణ కోల్పోయిన నాగేంద్ర.. మధులతపై దాడిచేసి...   అతికిరాతకంగా హత్యచేశాడు. ఆ తర్వాత భార్య మృతదేహాన్ని నాగేంద్ర కత్తితో ముక్కలుగా చేసేందుకు ప్రయత్నించాడు. కొంతభాగం కాలిని నరికేశాడు. తర్వాత ఆ ప్రయత్నం విరమించుకుని ప్రమాదంగా చిత్రీకరించేందుకు యత్నించాడు.

మధులత మృతదేహం వద్దకు గ్యాస్‌ సిలిండర్‌ తీసుకొచ్చాడు. ఇంతలో స్థానికులకు అనుమానంతో రావటంతో ఇంట్లో నుంచి పరారయ్యాడు. ఇరుగుపొరుగు వారిచ్చిన సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టారు. అప్పటికే పారిపోయిన నిందితుడిని మరుసటి రోజు చందానగర్‌ ప్రాంతంలో గుర్తించి అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. పెళ్లైన నాటి నుంచి మధులతను భర్త చిత్రహింసలకు గురిచేసినట్టు ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

ఈ నెల 4న అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. దాదాపు 20రోజుల వరకు ఈ ఉదంతం వెలుగులోకి రాలేదు. పోలీసులు సైతం కేసును గోప్యంగా ఉంచుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని మధులత తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు మాత్రం నిందితుడిని ఇప్పటికే తాము రిమాండ్‌ చేసినట్టుగా పోలీసులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: