పాత ఫోన్ కోసం ఆ మహిళ దారుణ హత్య..
పాత వస్తువుల్ని అపురూపంగా చూసుకుంటారు కొంతమంది. అలాంటి లిస్ట్ లో ఇప్పుడు పాత ఫోన్ కూడా చేరింది. ఇప్పుడున్న కీబోర్డ్ లాగా కాకుండా పాత ల్యాండ్ ఫోన్ లకు ఉన్న కీబోర్డ్ ఫోన్లకోసం ఇటీవల కొంతమంది ప్రయత్నిస్తున్నారు. ఆ ఫోన్లను ఎక్కువ రేటుకి అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి ఫోన్ విజయవాడలోని సత్యనారాయణపురం రైల్వే కాలనీలో ఉందని కొంతమందికి తెలిసింది. అప్పట్లో రైల్వే డిపార్ట్ మెంట్లో ఇలాంటి ఫోన్లు వాడేవారు. వాటిని తీసేసిన తర్వాత రైల్వే ఉద్యోగి దాన్ని ఇంట్లో తెచ్చిపెట్టుకున్నాడు. ఆ ఫోన్ కోసం వచ్చిన దొంగలు ఇంట్లో ఉన్న రైల్వే ఉద్యోగి సత్యనారాయణ భార్య సీతను హత్య చేశారు.
ఈ కేసులో చాలా మంది ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. రైల్వే ఉద్యోగుల పాత్ర కూడా ఇందులో ఉన్నట్టు గుర్తించారు. వారికి మాత్రమే ఆ ఫోన్ అక్కడ ఉన్నట్టు తెలుసు అని, ఆ కోణంలో పోలీసులు విచారణ చేపట్టారని అంటున్నారు. సత్యనారాయణ ఇంట్లో లేని సమయంలో ఆ ఫోన్ దొంగతనం చేయాలనుకున్నారు. ఓ పథకం ప్రకారమే ఆయన ఇంటికి వెళ్లారు. ఇంట్లోకి వెళ్లిన తర్వాత ఆయన భార్య కనిపించడంతో ఆమెతో గొడవ పడ్డారు. పెనుగులాటలో ఆమెని హత్య చేశారు. ఫోన్ తోపాటు ఆమె మెడలోని బంగారం, ఇంట్లోని డబ్బు దోచుకెళ్లారు. నిందితుల్ని కాల్ డేటా పట్టించింది. ఆ ప్రాంతంలో హత్య జరిగిన సమయంలో కాల్ డేట్ ఆధారంగా నిందితుల్ని పోలీసులు పట్టుకున్నారు. ఇక ఓ రైల్వే ఉద్యోగిని పోలీసు జాగిలాలు పట్టించడం విశేషం. అతని కాల్ డేటా ఆధారంగా పోలీసులు పట్టుకున్నా, అతను తనకేమీ తెలియదని బుకాయించాడు. కానీ పోలీస్ జాగిలం ఆ ఉద్యోగిని పట్టించింది.