దంపతులపై దాడి.. ఆపై అమానుషం..!

N.Hari
మహిళలపై అత్యాచారాలకు గుంటూరు జిల్లా కేంద్ర బిందువుగా మారిందా? అనే చర్చ రేకెత్తింది. గుంటూరు జిల్లాలో విద్యార్థిని రమ్య హత్య ఘటన మరవకముందే మరో ఘోరం జరిగింది. మేడికొండూరు పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళపై సామూహిక అత్యాచారం ఘటన తీవ్ర కలకలం రేపింది. బైక్‌పై వెళ్తున్న దంపతులపై దాడి చేసి.. దుర్మార్గానికి పాల్పడ్డారు దుండగులు. తాడికొండ నియోజకవర్గంలోని మేడికొండూరు మండలం పరిధిలో మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. సత్తెనపల్లికి చెందిన మహిళ మేడికొండూరు మండలం పాలడుగులోని బంధువుల ఇంట్లో జరిగిన వేడుకకు వెళ్లింది. బుధవారం రాత్రి 9.45 గంటల సమయంలో తన భర్తతో కలిసి సత్తెనపల్లికి ద్విచక్రవాహనంపై వస్తుండగా మార్గమధ్యలో వారిని దుండగులు అడ్డుకున్నారు. ఇద్దరిపైనా దాడి చేశారు. భర్తను బెదిరించారు. మహిళపై ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం వారి వద్ద ఉన్న డబ్బు, నగలు తీసుకుని పారిపోయారు. బాధితులు సత్తెనపల్లి పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేస్తే.. ఘటన జరిగింది మా పరిధిలో కాదని చెప్పారు. దీంతో ఉదయం మేడికొండూరు పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఐపీసీ 376డి, 394, 342 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
ఈ ఘటనకు సంబంధించి పోలీసులు వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. బాధితులు సత్తెనపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పుడు అక్కడ కేసు నమోదు చేయకపోవటాన్ని విపక్షాలు తప్పుబడుతున్నాయి. జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా తమ పరిధి కాదని తప్పించుకున్నారని ఆరోపిస్తున్నారు. జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధితురాలిని జనసేన, బీజేపీ, సీపీఐ, కాంగ్రెస్‌ నేతలు పరామర్శించారు. ఈ ఘటనకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. జిల్లాలో మహిళలపై వరుసగా జరుగుతున్న అత్యాచారాలు, హత్యలను అరికట్టడంలో పోలీసులు విఫలమయ్యారని ఆరోపించారు.
అయితే గ్యాంగ్‌ రేప్‌ ఘటనపై పోలీసులు సకాలంలోనే స్పందించారని సత్తెనపల్లి డీఎస్పీ విజయభాస్కరరెడ్డి చెబుతున్నారు. బాధితులు సత్తెనపల్లి స్టేషన్‌కు రాగానే వారి నుంచి వివరాలు తీసుకుని మేడికొండూరు పోలీసులకు సమాచారం ఇచ్చారని తెలిపారు. అలాగే  రెండు స్టేషన్లకు సంబంధించిన పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లటంతో పాటు నిందితుల కోసం గాలించినట్లు డీఎస్పీ వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: