కన్న కూతురినే కాల్చి చంపిన తండ్రి.. ఎందుకో తెలుసా?
ఆ వ్యక్తి కూతురు పుట్టగానే ఇక ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చింది అని ఎంతో సంతోష పడిపోయాడు. కూతురికి ఏ కష్టం రాకుండా ఎంతో అల్లారు ముద్దుగా పెంచాడు. ఏం కావాలన్నా ఇట్టే కొని తెచ్చే వాడు. అంత అల్లారుముద్దుగా పెంచుకున్న ఆ తండ్రి చివరికి ఆ కూతురి పాలిట కాల యముడు గా మారిపోయాడు. పెళ్లి విషయంలో తండ్రి కూతుర్లు ఇద్దరి మధ్య మొదలైన వివాదం చిలికి చిలికి గాలి వానలా మారింది. చివరికి అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురిని దారుణంగా కాల్చి చంపాడు ఆ తండ్రి. మధ్యప్రదేశ్ లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
మధ్యప్రదేశ్ లోని జారే గ్రామంలో అశోక్ వైష్ అనే 69 ఏళ్ల వ్యక్తి ఉన్నాడు. అతనికి ఒక కూతురు ఉంది. కూతురు అంటే అతనికి ఎంతో ప్రాణం. చిన్నప్పటి నుంచి కంటికి రెప్పలా చూసుకుంటూ పెంచాడు. ఏ కష్టం రాకుండా చూసుకున్నాడు. అయితే పెద్దయిన తర్వాత ఒక మంచి వరుడు ని తీసుకొచ్చి పెళ్లి చేసి తన కూతురుని మెట్టినింటికి పంపాలి అనుకున్నాడు. అయితే ఈ విషయమే కూతురుకు చెబితే కూతురు మాత్రం ఇప్పట్లో పెళ్లి చేసుకోను అని చెప్పేసింది. ఈ క్రమంలోనే తండ్రి కూతురు మధ్య పెళ్లి విషయంలో వివాదం మొదలైంది. ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది . ఇక తన కూతురు తనకు ఎదురు మాట్లాడుతుంది అని తండ్రి తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. దీంతో ఇక ఇంట్లో ఉన్న తుపాకీతో కాల్చాడు. దీంతో ఆ యువతి అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. ఇక సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితున్ని అరెస్టు చేశారు.