ఈరోజు కాస్త కొత్తగా "మస్తి కోకోనట్ బాల్స్" చేసేద్దామా?
మరి దానికి కావాల్సిన పదార్థాలు మరియు చేసే విధానం ఇదిగోండి....
కావలసిన పదార్థాలు:
పచ్చి కొబ్బరి తురుము - 3 కప్పులు
శనగపిండి(బేసన్) - 2 టేబుల్ స్పూన్లు
వరి పిండి (బియ్యం పిండి) - 2 టేబుల్ స్పూన్లు
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
గరంమసాలా - 1/2 టేబుల్ స్పూన్
కారం పొడి - 1 టేబుల్ స్పూన్
ఉప్పు - తగినంత
నువ్వులు - 1/4 టేబుల్ స్పూన్
పసుపు - చిటికెడు
నూనె - డీప్ ఫ్రైకి సరిపడా
తయారు చేసే విధానం:
ఒక గిన్నెలో 3 కప్పుల పచ్చి కొబ్బరి తురుము, 2 టేబుల్ స్పూన్లు శనగపిండి, 2 టేబుల్ స్పూన్లు బియ్యం పిండి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ కారం పొడి, 1/4 టేబుల్ స్పూన్ నువ్వులు,చిటికెడు పసుపు, తగినంత ఉప్పు వేసి అన్ని కలిసేట్టుగా కలుపుకోవాలి. (గమనిక:ఒక చుక్క నీరు కూడా వాడకూడదు, కొబ్బరిలో ఉన్న తడి సరిపోతుంది) అలా కలుపుకున్న ముద్దని 2 నిమిషాలపాటు పక్కకి పెట్టి దాన్ని ఒక మూతతో కవర్ చేయాలి. ఈ లోపు డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేడికి పెట్టుకోవాలి. కొబ్బరి ముద్దను చిన్న చిన్న బాల్స్ చేసుకొని వాటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. దీన్ని వేడి వేడిగా పెరుగు లేదా టమాటో సాస్‌తో సర్వ్ చేయొచ్చు.
ఈ మస్తీ బాల్స్ మనకి రెండు రోజుల పాటు నిల్వ ఉంటాయి.
మరి ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి, మస్తీకి మస్తీ అయిన మస్తీ కోకోనట్ బాల్స్ మీరు ఎప్పుడు చేయబోతున్నారు?