
వంకాయతో ఈ కాంబినేషన్ అదరహో...!
కావాల్సిన పదార్ధాలు:
వంకాయలు 250 గ్రాములు
సెనగపప్పు 50 గ్రాములు
ఉల్లిపాయ 1
కరివేపాకు 2 రెబ్బలు
అల్లం వెల్లుల్లి ముద్ద 1/2 టీ స్పూన్
పసుపు 1/4 టీస్పూన్
కారం పొడి 1 టీస్పూన్
గరం మసాలా పొడి 1/4 టీస్పూన్
ఉప్పు తగినంత
నూనె 3 టీస్పూన్లు
తయారు చేయు విధానం :
ముందుగా ఒక గిన్నెలో సెనగపప్పు తీసుకుని కడిగి నీళ్ళు పోసి అరగంట పాటు నానబెట్టాలి. తరువాత వంకాయలు ముక్కలుగా తరిగి ఉప్పు నీళ్ళలో వేసి ఉంచాలి. ఉప్పు నీటిలో వేయకపోతే నల్లగా మారిపోయి గట్టిగా అవుతాయి. తరువాత గిన్నెలో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించాలి.ఇందులో పసుపు, కరివేపాకు, అల్లం, వెల్లుల్లిముద్ద వేసి పచ్చి వాసన పోయేదాకా వేపాలి. ఇప్పుడు వంకాయ ముక్కలు వేసి బాగా మగ్గనివ్వాలి. అవి మగ్గిన తరువాత కొద్దిగా కారంపొడి వేసి ఒక 10 నిముషాలు ఉంచాలి. ముందుగా నానపెట్టుకుని ఉంచుకున్న పచ్చిశెనగపప్పు కూడా వేసి ఒకసారి గరిటెతో తిప్పి మూత పెట్టాలి. కొంచెం సేపు అయ్యాక కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి.కూర ఉడికిన తరువాత గరం మసాలా పొడి వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ కూరకి నూనె తగినంత ఉంటేనే రుచిగా ఉంటుంది.