ఓర్నీ: భార్య అకౌంట్లో డబ్బు కాజేసేందుకు భర్త స్కెచ్.. షాకైన అధికారులు..!!

N.ANJI
డబ్బు మనిషిని ఏమైనా చేపిస్తుంది. సొంతవారిని పరాయి వాళ్ళను చేస్తుంది. డబ్బు కోసం సొంత వాళ్ళను చంపడానికి కూడా వెనుకాడదు. తాజాగా ఓ భర్త తన భార్య నుండి డబ్బులు తీసుకోవడానికి వేసిన స్కెచ్‌తో అడ్డంగా బుక్కయిన సంఘటన ఏపీలోని కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఏపీలోని కృష్ణా జిల్లా విస్సన్నపేటకు చెందిన చల్లా నిర్మల స్థానికంగా ఓ స్వయం సహాయక సంఘంలో సభ్యురాలిగా ఉంది. ఇక ఇదిలా ఉంటే ఆమె భర్త శ్రీనివాస్ వేరే మహిళతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు.
ఈ తరుణంలోనే అతడు భార్యతో గొడవపడి ఆమెను ఇంటి నుంచి బయటికి పంపించాడు. అయితే నిర్మలను ఇంటి నుంచి గెంటేసిన కొన్నాళ్లకు ఆమె మెంబర్‌గా ఉన్న డ్వాక్రా సంఘానికి రూ.10 లక్షల రుణం మంజూరు అయ్యింది. దీంతో గ్రూపు లీడర్ సభ్యులందరికీ రూ.లక్ష చొప్పున అకౌంట్ జమ చేశారు.
ఈ విషయం తెలుసుకున్న శ్రీనివాస్ ఆమె అకౌంట్‌లో ఉన్న లక్ష రూపాయలు కాజేయడానికి స్కెచ్ వేశాడు. ఆమె బ్యాంక్ పాస్ పుస్తకంలో భార్య ఫోటో తీసేసి.. తాను అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళ ఫోటో పెట్టాడు. అంతేకాక ఆమె సంతకాన్ని కూడా ఫోర్జరీ చేసి స్థానిక సప్తగిరి బ్యాంక్ అధికారులను నమ్మించి లక్ష రూపాయలు డ్రా చేసి ఆ డబ్బుతో ప్రియురాలితో కలిసి పారిపోయాడు.
ఇక ఈ విషయం తెలుసుకున్న నిర్మల బ్యాంక్ అధికారులను నిలదీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అయితే తమ పరువు పోతుందని భావించిన బ్యాంక్ అధికారులు.. స్థానిక పెద్దల సాయంతో నిర్మలతో రాజీపడినట్లు తెలుస్తోంది. ఇక నిర్మల పేరిట కొత్త అకౌంట్ ఓపెన్ చేయడంతో పాటు అందులో కొంత నగదు కూడా జమ చేసినట్లు సమాచారం. అయితే నిర్మల అకౌంట్లో డబ్బులు దుర్వినియోగమైనా.. ఆమెకు అన్యాయం జరగకుండా చర్యలు తీసుకున్నామని బ్యాంక్ మేనేజర్ వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: