మ్యూచువల్ ఫండ్ పథకాలలో పెట్టుబడి పెట్టినప్పుడు మీ పోర్టుఫోలియోను ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలి. మార్కెట్ పరిస్థితులను బట్టి మీ పెట్టుబడి ఎలా ఉందో తనిఖీ చేయాలి. కొన్ని సార్లు ఇది మీ అంచనా/బెంచ్ మార్క్ కంటే వెనుకబడి ఉండొచ్చు, కొన్నిసార్లు మెరుగ్గా ఉండవచ్చు. అప్పుడు మీరు పెట్టుబడులను తక్కువ పనితీరు ఉన్న ఫండ్ల నుంచి మెరుగైన ఫండ్లకు మార్చవలసి ఉంటుంది. అంతేకాకుండా, మరోవైపు మీ పోర్టుఫోలియోలో ఫండ్లు రాబడులను గణనీయంగా అధిగమించినట్లయితే మీరు అధిక రిస్క్ పథకం నుంచి తక్కువ రిస్క్ మ్యూచువల్ ఫండ్ పథకానికి పెట్టుబడులను మార్చడం ద్వారా మీ పోర్టుఫోలియోను సమం (బ్యాలెన్స్) చేసుకోవచ్చు.మీరు దీర్ఘకాలికంగా వాయిదాలలో పెట్టుబడి పెట్టి మంచి నిధి సమకూర్చుకోవాలనుకుంటే తగిన ఈక్విటీ ఫండ్‌లో సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) ద్వారా పెట్టుబడి పెట్టవచ్చు. మార్కెట్లు కొన్ని సమయాలలో అస్థిరంగా ఉండడం సహజమే, అయినా కూడా దీర్ఘకాలం పాటు SIP ద్వారా పెట్టుబడులు పెట్టినవారు మార్కెట్ల స్థిరీకరణ తర్వాత లాభాలతో పుంజుకుంటారు.
చిన్న మొత్తాలతో క్రమం తప్పకుండా ప్రతి నెలా మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టాలనుకునే వారు బ్యాంకు ద్వారా SIP ఆప్షన్ పెట్టుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్లు ద్రవ్యోల్బణాన్ని అధిగమించడంలో, సంపదను సృష్టించడంలో సహాయపడుతున్నాయి.మార్కెట్లో అనేక మ్యూచువల్ ఫండ్ సంస్థలు ఉన్నాయి. ప్రతి ఒక్కటి అనేక పథకాలను అందిస్తోంది. మంచి కంపెనీలో ఉత్తమ పథకంలో పెట్టుబడి పెట్టడానికి ముందు, వాటి గత పనితీరు, నిర్వహణ సామర్థ్యం, వ్యయ నిష్పత్తిని చూడాలి. అంతేకాకుండా స్థిరమైన రాబడిని అందించే సామర్థ్యం కలిగి ఉన్నవాటిని గుర్తించడానికి ఆన్‌లైన్‌లో పథకాలను సరిపోల్చుకోవాలి. 'రెగ్యులర్ ప్లాన్ల' కంటే తక్కువ వ్యయ నిష్పత్తి ఉండే డైరెక్ట్ ప్లాన్లకే ప్రాధాన్యత ఇస్తే మంచిది.ఏకమొత్తంలో పెట్టుబడులకు రిస్క్ కాస్త ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఇలాంటి పెట్టుబడులకు స్వల్పకాలంలో నష్టభయం ఎక్కువగా ఉంటుంది. అయితే, కనీసం 10 ఏళ్ళ పాటు మదుపు చేయగలిగితే రిస్క్ తగ్గుతూ ఉంటుంది. అధిక మొత్తం లో మదుపు చేసే వారు కొంత ఇండెక్స్ ఫండ్లో మరి కొంత మిడ్ కాప్ ఫండ్లో పెట్టుబడి పెట్టవచ్చు.