ఐపీఎల్ కోసం ముఖేష్ కొత్త వ్యాపారం...!

Podili Ravindranath
ప్రపంచ క్రికెట్‍లోనే అత్యంత సంపన్నమైన క్రికెట్ బోర్డు ఏది అంటే... ఠక్కున చెప్పే సమాధానం బీసీసీఐ. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఈ స్థాయిలో ఆర్థికంగా బలపడేందుకు ప్రధాన కారణం కేవలం ఇండియన్ ప్రీమియర్ లీగ్ మాత్రమే. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టోర్నమెంట్‌గా ఐపీఎల్ ఇప్పటికే గుర్తింపు తెచ్చుకుంది. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డుకు కాసుల వర్షం కురిపిస్తోన్న టోర్నీ ఐపీఎల్ మాత్రమే. దాదాపు రెండు నెలల పాటు సాగే ఈ టోర్నీ... వరల్డ బిగ్గెస్ట్ స్పోర్ట్స్ ఈవెంట్‌గా కూడా గుర్తింపు తెచ్చుకుంది. బీసీసీఐకి బంగారు బాతులా మారిన ఈ ధనాధన్ టోర్నీ కోసం ఇప్పటికే బడా బడా కంపెనీలు ఎదురు చూస్తున్నాయి. ఇప్పటికే ఉన్న జట్ల స్థానంలో మరో రెండు కొత్త ఫ్రాంచైజీలకు కూడా వచ్చే టోర్నీ నుంచి అవకాశం కల్పించనుంది ఐపీఎల్ మేనేజ్‌మెంట్. ఈ రెండు ఫ్రాంచైజీల ద్వారానే... మరో 13 వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని తన ఖాతాలో వేసుకుంది ఐపీఎల్. అహ్మదాబాద్ నుంచి సీవీసి కేపిటల్స్, లక్నో నుంచి ఆర్పీ - సంజీవ్ గోయంకా జట్లు వచ్చే టోర్నీలో ఆడనున్నాయి.
ఈ మెగా టోర్నీ ప్రసార హక్కుల కోసం ఇప్పటికే ప్రముఖ కంపెనీలు పోటీ పడుతున్నాయి. ఈ టోర్నీ ప్రసార హక్కుల ద్వారా మరింత ఆదాయం రాబట్టేందుకు బీసీసీఐ కూడా గట్టిగానే ప్రయత్నం చేస్తోంది. 2023- 2027 మధ్య కాలంలో 5 సంవత్సరాల కాలంలో జరిగే ఐదు టోర్నీలకు సంబంధించిన ప్రసార హక్కుల కోసం ఇప్పుడు బడా బడా సంస్థలు పోటీ పడుతున్నాయి. 2018- 2022 మధ్య కాలానికి సంబంధించిన ప్రసార హక్కుల గడువు వచ్చే ఏడాది టోర్నీతో ముగిస్తోంది. దీంతో రాబోయే ఐదేళ్ల కాలానికి 5 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని పొందేందుకు బీసీసీఐ ప్రయత్నం చేస్తోంది. రాబోయే ఐదేళ్ల కాలంలో ప్రసార హక్కుల కోసం ఇప్పటికే స్టార్ నెట్ వర్క్, సోనీ - జీ నెట్ వర్క్ సంస్థలు ఇప్పటికే పోటీ పడుతున్నాయి. అయితే ఇప్పుడు కొత్తగా రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థకు చెందిన జియో ఛానల్ కూడా బిడ్డింగ్‌లో పాల్గొంటోంది. ఇప్పటికే 16 వేల 347 కోట్ల రూపాయల విలువ చేసే బిడ్డింగులను బీసీసీఐ అందుకుంది. వచ్చే ఏడాది నుంచి ఈ టోర్నీలో మొత్తం 10 జట్లు పాల్గొంటున్నాయి. 74 మ్యాచ్‌లు జరగనుండటంతో... బిడ్డింగ్ ధర రెట్టింపు అయ్యే అవకాశం ఉందని బీసీసీఐ అధికారులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ipl

సంబంధిత వార్తలు: