హెచ్చరిక.. ఈ నాలుగు రోజులూ బ్యాంకులు ఉండవట

yekalavya
ఇంటర్నెట్ డెస్క్: బ్యాంకులో నగదు వేయాలా..? లేదా తీసుకోవాలా..? లేదా ఇంకా ఏదైనా ఇతరత్రా పనులు బ్యాంకులతో ముడిపడి ఉన్న పనులు పెండింగ్ పెడుతున్నారా..? అయితే ఓ సారి ఆలోచించుకోండి. ఎందుకంటే ఏకంగా 4 రోజుల పాటు బ్యాంకులన్నీ మూతపడనున్నాయి. దీంతో మీ పనులన్నీ పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంది. అందువల్ల వెంటనే బ్యాంకులకు వెళ్లి మీమీ పనులు కానిచ్చేయండి లేకపోతే ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. అయితే బ్యాంకులు ఎందుకు ఉండవు..? ఎప్పుడు ఉండవు..? దీనికి సంబంధించి ఇప్పుడు తెలుసుకుందాం.
కేంద్ర ప్రభుత్వం ఇంతకుముందు బ్యాంకులను విలీనం చేసిన విషయం తెలిసిందే. దీని వల్ల అనేక స్థానిక, చిన్న తరహా బ్యాకులన్నీ పెద్ద, జాతీయ బ్యాంకుల్లో విలీనమైపోయాయి. అయితే తాజాగా బ్యాంకులను ప్రైవేటీకరణ చేస్తున్నట్లు ప్రకటించింది. దీనికి అన్ని రకాల ఏర్పాట్లూ చేసేసింది. ఇప్పటికే బ్యాంకుల విలీనాన్ని వ్యతిరేకిస్తున్న అనేకమంది ఉద్యోగులు ఇప్పుడు బ్యాంకుల ప్రైవేటీకరణను పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆందోళన చేసేందుకు సిద్ధమయ్యారు. ఆ నిరసనలో భాగంగానే మార్చి 15వతేదీ నుంచి రెండు రోజుల పాటు సమ్మెకు బ్యాంకు ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చాయి.
బ్యాంకు ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో మార్చి 13 నుంచి వరుసగా 4రోజుల పాటు బ్యాంకులు మూసివేయనున్నారు. మార్చి 13వతేదీన రెండవ శనివారం కాగా, మార్చి 14వతేదీ ఆదివారం సెలవు. మార్చి 15,16 తేదీల్లో బ్యాంకు ఉద్యోగుల సమ్మెతో బ్యాంకులు మూసివేయనున్నారు.మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ కార్యకలాపాలు నిరంతరాయంగా కొనసాగుతున్నప్పటికీ వరుసగా 4రోజుల పాటు బ్యాంకుల కీలక శాఖలు కానీ, బ్రాంచీలు కానీ ఎక్కడా పనిచేయవని సదరు బ్యాంకు సంఘాలు వెల్లడించాయి.
ఇదిలా ఉంటే మార్చి నెలలో దాదాపు 10 రోజులకు పైగా బ్యాంకులు పనిచేయవు. పండుగ సెలవులు, బ్యాంకుల ఖాతాల ముగింపు, రెండవ శనివారాలు, 4 ఆదివారాలతో కలిసి మొత్తం మార్చి నెలలో 11 రోజులపాటు బ్యాంకు శాఖలు పనిచేయవు. ఈ క్రమంలోనే ఖాతాదారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని బ్యాంకులు సూచిస్తున్నాయి. మార్చి 11వతేదీన మహాశివరాత్రి సందర్భంగా సెలవు ప్రకటించారు. మార్చి 22వ తేదీన బీహార్ దివస్, మార్చి 30న హోలి పండుగ సందర్భంగా బ్యాంకులకు సెలవు ప్రకటించారు. వరుస సెలవులతో బ్యాంకులను మూసివేస్తున్నందున ఖాతాదారులు తమ ఆర్థిక లావాదేవీల కోసం ముందస్తు ప్రణాళిక రూపొందించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా సమ్మె సులవులు కూడా చేరడంతో ఖాతాదారులకు మరింత సమస్యలు తలెత్తనున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: