రైల్వే ప్రయాణీకులకు బ్యాడ్ న్యూస్..!

NAGARJUNA NAKKA
భారతదేశంలోనే అతిపెద్ద ప్రజా రవాణా వ్యవస్థ రైల్వే. రోజుకు లక్షలాది మంది ప్రయాణీకులను తమ గమ్య స్థానాలకు సురక్షితంగా చేరుస్తోంది. ఇతర వాహనాల ప్రయాణంతో పోలిస్తే రైలులో ప్రయాణం ధర చాలా తక్కువ. అందుకే అన్ని వర్గాల ప్రజలు ప్రయాణానికి రైళ్లను ఆశ్రయిస్తున్నారు. దీంతో రైల్వే సేవలు భారతదేశంలో ప్రజాధరణ పొందాయి. దానికి తగ్గట్టుగానే మంచి ఆదాయాన్నే అర్జిస్తూ కేంద్ర ఖజానాకు లోటు లేకుండా చేస్తున్నాయి. 


ఇదిలా ఉంటే తాజాగా ఐఆర్ సీటీసీ బోర్డ్ రైల్వే ప్రయాణీకులకు ఊహించని భారీ షాక్ ఇచ్చింది. టూరిజం, క్యాటరింగ్ రైల్వే బోర్డ్ డైరెక్టర్ ఓ సర్క్యులర్ విడుదల చేశారు. అందులో ఏముందంటే.. రాజధాని, శతాబ్ధి, దురంతో ఎక్స్ ప్రెస్ రైళ్లలో టీ, టిఫిన్, భోజనం రేట్లు పెంచుతున్నట్టు తెలియజేశారు. అంతేకాదు భోజనంపై క్యాటరింగ్ సేవల రేట్లను ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ సర్క్యులర్ లో పొందుపరిచింది. రాజధాని, శతాబ్ధి, దురంతో ట్రైన్లలో క్యాటరింగ్ సేవలపై కొత్త ధరలను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపింది.  


క్యాటరింగ్ సర్వీస్ లో కొత్త మెనూ.. రేట్లు, టికెటింగ్ విధానంపై 15 రోజలు తర్వాత పూర్తి వివరాలు అందిస్తామనీ.. పెంచన రేట్లు సర్క్యులర్ జారీ చేసిన తేదీ నుండి 120 రోజుల తర్వాత వర్తిస్తాయని తెలిపింది. అంటే నవంబర్ 14నుంచి 120రోజుల తర్వాత  అమల్లోకి వస్తాయని వివరించింది. ధరల సవరణ తర్వాత రాజధాని, దురంతో, శతాబ్ధి ఎక్స్ ప్రెస్ లలో ఒక కప్పు టీ ధర.10 రూపాయల నుంచి రూ.15కు పెంచారు. అదే స్లీపర్ క్లాస్, సెకండ్ క్లాస్ ఏసీ బోగీల్లో అయితే టీ ధర రూ.20. ఇక భోజనం విషయానికొస్తే... దురంతో ఎక్స్ ప్రెస్ స్లీపర్ క్లాస్ లో లంచ్ లేదా డిన్నర్ కు 120రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. మునుపటి ధర 80 రూపాయలు కాగా.. ఇపుడు ఏకంగా 40రూపాయలు పెరిగాయి.  ఈ రైళ్లలో సాయంత్రం సమయాల్లో ఫస్ట్ క్లాస్ ఏసీ, ఎగ్జిక్యూటివ్ క్లాస్ లో టీ ధర 6రూపాయలు పెరిగి.. 35రూపాయలు చేరుకుంది. ఇక అల్పాహారం ధర 7రూపాయలు పెరిగి 140రూపాయలకు చేరుకుంది. ఇక లంచ్ లేదా డిన్నర్ ధర ఏకంగా 15రూపాయలు పెరిగి 245రూపాయలకు చేరుకుంది. మొత్తానికి భారతీయ రైల్వే ఐఆర్ సీటీసీ.. క్యాటరింగ్ సర్వీస్ లో భాగంగా ధరల పెరుగుదలపై తీసుకున్న నిర్ణయం ప్రయాణీకులపై భారం మోపింది.   


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: