బుడమేరు హెచ్చరిక: ' విజయవాడ Vs వి'జల'వాడ..ఇప్పటికైనా కళ్లుతెరవండి..!?

FARMANULLA SHAIK
* కృష్ణమ్మ కంటే 'బుడమేరే' ప్రమాదకరంగా మారేనా.?
* బెజవాడ దుఃఖదాయనిగా 'బుడమేరు'.!
* బెజవాడకు శాశ్వత పరిష్కారం ఎలా..?
(ఏపీ-ఇండియాహెరాల్డ్): రెండు తెలుగు రాష్ట్రాల్లో గత నాలుగు రోజుల నుండి ఎవరు మాట్లాడుకున్న విజయవాడ, ఖమ్మం గురించి తప్ప మరేఇతర విషయం గూర్చి మాట్లాడటం లేదు.ఏపీలో అయితే మునుపెన్నడు లేని విధంగా విజయవాడ ప్రజలు మాత్రం కోలుకోలేని దెబ్బకు గురి అయ్యారు.విజయవాడలో 30 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా వర్షం కురిసింది. ఒకే రోజు 20 సెం.మీ. వర్షపాతం నమోదవ్వడంతో శుక్ర, శనివారాల్లో విజయవాడ మహానగరంలోని పలు ప్రాంతాల్లో 4 అడుగుల మేర నీరు నిలిచింది. ఆదివారం కూడా అదే పరిస్థితి కొనసాగడంతో బుడమేరుకు వరద పోటెత్తింది.దీంతో విజయవాడ నగరం అతలాకుతలమైంది.బుడమేరు వాగు పొంగి ప్రవహించడంతో నగరంలోని దాదాపు పదహారు డివిజన్లను వరద నీరు అన్ని ప్రాంతాలను ముంచెత్తింది.విద్యాధరపురం, పాల ప్రాజెక్టు, చిట్టినగర్, రాజరాజేశ్వరిపేట, సింగ్ నగర్ లోని కాలనీ ల్లోని రహదారులు, నివాసాల్లోకి భారీగా వరద నీరు ప్రవేశించింది.ఆదివారం తెల్లవారుజాము నుంచే ఆయా ప్రాంతాలకు వరద చేరుతూ మధ్యాహ్నానికి వేలాది గృహాల్లోకి వరదనీరు ప్రవేశించింది. ఏ ఇంటిని చూసినా వరద నీటిలోనే మునిగి కనిపిస్తోంది.
అయితే విజయవాడ విపత్తుకు అసలు కారణం వాగులు,వంకలు ఆక్రమణకు జరిగే విలయతాండంవం ఎలా ఉంటుందో బెజవాడ ప్రజలకు తెలిసేలా చేసింది ప్రకృతి.20ఏళ్ల క్రితం చేపట్టిన ఆపరేషన్ కొల్లేరు అర్థాంతరంగా నిలిచిపోవడంతో దానికి మూల్యం చెల్లించుకుంటున్నారు.గత ఇరవై ఏళ్లలో విజయవాడ నగరం ఊహించని వేగంగా విస్తరించడం, బుడమేరు ప్రవాహ మార్గాన్ని కబ్జా చేయడమే ప్రస్తుత పరిస్థితికి కారణమైంది.విజయవాడ నగరానికి పక్కగా ప్రవహించే కృష్ణానదికంటే నగరం మధ్యలో ప్రవహించే బుడమేరుతో దశాబ్దాలుగా అక్కడి ప్రజలను భయబ్రాంతులకి గురి చేస్తుంది.2005 లో వచ్చిన భారీ వర్షాలతో బుడమేరు నగరాన్నిఅతలాకుతలం చేసి విజయవాడను మూడొంతులు ముంపుకు గురి చేసింది.రికార్డు స్థాయిలో ఎగువున ఖమ్మం జిల్లా నుంచి వరద ప్రవాహం పోటెత్తడంతో అదంతా విజయవాడను ముంచెత్తింది.ఖమ్మం జిల్లాలో పుట్టే బుడమేరు ఏటా సాధారణ సీజన్‌లో గరిష్టంగా పదకొండు వేల క్యూసెక్కుల ప్రవాహంతో ప్రవహిస్తుంది.2005లో అది 70వేల క్యూసెక్కులకు చేరింది దాంతో విజయవాడ చాలా వరకూ దెబ్బతింది. ఆ తరువాత 2009లో మరోసారి అలాంటి పరిస్థితే ఎదురైంది.బుడమేరు వాగు తన ప్రయాణంలో చాలా మలుపులు మెలికలు తిరుగుతూ ఉంటుంది. దానివల్ల ఎక్కువ ప్రవాహం వచ్చినపుడు అది గట్టు దాటి చుట్టూ ఉన్న ప్రాంతాలకు చేరిపోతూ ఉండేది. అందుకే ఈ నదికి బెజవాడ దుఃఖ:దాయని అని పేరు పడింది.
2005లో వచ్చిన భారీ వరదలు చూసిన ఇరిగేషన్ శాఖ బుడమేరు నది పొడవునా ఒక రిటైనింగ్ వాల్ నిర్మించాలనే సూచన చేసింది. దీనిపై అప్పట్లో కొంతమేర వర్క్ జరిగినా తరువాత పూర్తిగా పక్కన పెట్టేశారు. బుడమేరు నుంచి నీరు రెండు భాగాలుగా ఒకటి డైరెక్ట్గా కొల్లేరు చేరుకుంటే మరొకటి కృష్ణలో కలుస్తుంది. బుడమేరు ప్రవహించే ప్రాంతంలో ఈ రెండు దశాబ్దాల్లో విపరీతంగా భూ ఆక్రమణలు, రియల్ ఎస్టేట్ వ్యవహారాలు పెరిగాయి. ఈ ప్రాంతాల్లో తక్కువ రేటుకే స్థలం లభిస్తుండడంతో పేద మధ్య తరగతికి చెందిన ప్రజలు కొనుగోలు చేసి ఇళ్ళు కట్టుకున్నారు. దానితో బుడమేరు ప్రవహించే చాలా భాగం ఆక్రమణకు గురైంది. ఇప్పుడు భారీ వర్షాలు కురియడంతో పైనుంచి వచ్చిన వరద నీరు ఆ ఆక్రమణలను ముంచేసింది. దానితో బెజవాడ కనీవినీ ఎరుగని విధ్వంసాన్ని ఎదుర్కొంటుంది. గుంటూరు, అమరావతి ,విజయవాడను కలిపి ఒక విశ్వనగరంగా ఏపీకి క్రొత్త రాజధానిగా నిర్మించాలని చూస్తున్న ప్రభుత్వ ఆలోచనలకు ఈ వరదలు దాగున్న పెద్ద ప్రమాదాన్ని తెలియజేశాయి. ప్రభుత్వం ఇప్పటికైనా చిత్తశుద్ధితో బుడమేరుకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సూచనలతో రిటైనింగ్ వాల్ నిర్మించడంతోపాటు నదీ పరివాహక ప్రాంతంలోని ఆక్రమణలను తొలగిస్తేనే బుడమేరుతో బెజవాడకు ఉన్న ప్రమాదం తొలగుతుంది అని పర్యావరణ వేత్తలు నిపుణులు చెబుతున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: