తొమ్మిదిన్నర సంవత్సరాలపాటు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్.. స్వేద పత్రం విడుదల చేయడాన్ని కాంగ్రెస్ తప్పుబట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతమని..మేడిగడ్డలో తప్పు జరిగితే సరి చేయండంటున్నకేటిఆర్.. అక్కడ పిల్లర్ కుంగుబాటు బయటపడిన రోజు అధికారంలో ఉండి ఏం చేశారని ఆ పార్టీ నిలదీస్తోంది. అప్పటికీ ఎన్నికల షెడ్యూల్ రాలేదు కదా? దిద్దుబాటు చర్యలు ఎందుకు తీసుకోలేదని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్ ప్రశ్నించారు. కేటీఆర్ విడుదల చేసిన స్వేద పత్రంలో పసలేదని ఆయన ఆరోపించారు.
యాభై లక్షల కోట్లు సంపద సృష్టించినట్లు చెప్పడం ఒక మిథ్యగా పేర్కొన్న ఆయన దానిని ప్రజలు కూడా నమ్మడం లేదన్నారు. అధికారం కోల్పోయినా.. తమ పాలన సువర్ణ అధ్యాయమని, స్వర్ణయుగమని పేర్కొనడం సిగ్గు చేటని ఆయన ఆరోపించారు. తెలంగాణ కోసం కాంగ్రెస్ నాయకత్వంతో సుదీర్ఘ పోరాటం చేసి, సోనియా గాంధీని ఒప్పించి, పార్లమెంటులో తెలంగాణా బిల్లును పాస్ చేయించిన కాంగ్రెస్ నాయకులేనని నిరంజన్ పేర్కొన్నారు.