తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఫ్రీ బస్ సర్వీస్ కల్పించిన సంగతి తెలిసిందే. రాష్ట్రమంతా దీనిపై చర్చించుకుంటుంటే ఓ కండక్టర్ మాత్రం ఈ విషయం తెలియకుండా ఏకంగా ఉద్యోగానికి ఎసరు తెచ్చుకున్నాడు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం నిన్నటి నుంచే అందుబాటులోకి వచ్చింది. కానీ ఒకరిద్దరు కండక్టర్లు ఇంకా మహిళలకు టిక్కెట్లు జారీ చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్ డిపో పరిధిలోని ఓ కండక్టర్ తనకు టికెట్ జారీ చేసినట్లు ఓ మహిళ ఆర్టీసీ ఎండీ సజ్జన్నార్ కు సోషల్ మీడియాలో ఫిర్యాదు చేశారు.
ఈ విషయంపై స్పందించిన ఆర్టీసీ ఎండీ సజ్జన్నార్ సదరు కండక్టర్ పై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని సోషల్ మీడియాలోనే స్పష్టం చేశారు. సంబంధిత కండక్టర్ కు బాధ్యతలు అప్పగించకుండా డిపో స్పేర్ లో ఉంచేశారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు ఎండీ సజ్జన్నార్ వెల్లడించారు.