కరోనా మందుల పేరిట విద్యార్ధినితో నిద్రమాత్రలు మింగించి ప్రిన్సిపాల్ పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన ఘటన ఏపీలో కలకలం రేపుతోంది. తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ఈ దారుణంపై రాష్ట్ర మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించింది. కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ కాకినాడ ఎస్పీతో ఈ ఘటనపై ఆరా తీశారు. తూర్పు గోదావరి జిల్లా మహిళా కమిషన్ సభ్యులు కర్రి జయశ్రీని బాధితురాలికి వైద్య సహయాన్ని పర్యవేక్షించాలని పద్మ సూచించారు. విజయ కుమార్‌పై పోక్సోకు మించిన సెక్షన్లతో కఠినచర్యలు చేపట్టాలని వాసిరెడ్డి పద్మ ఆదేశాలిచ్చారు. వారం రోజుల్లో చార్జిషీట్ ను కోర్టులో దాఖలు చేసి నిందితుడికి కఠిన శిక్ష అమలయ్యేలా చూడాలన్నారు. మహిళలు, బాలికల వసతిగృహాల పర్యవేక్షణను ఏ ఒక్కరి చేతిలో ఉంటే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని వాసిరెడ్డి పద్మ అన్నారు. అందుకే ఇద్దరు ముగ్గురు బృందంతో పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించాల్సిన అవసరం ఉందని మహిళా కమిషన్ చైర్ పర్సన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో హెల్పింగ్ హ్యాండ్స్ ప్రిన్సిపాల్ విజయ కుమార్ ను తూర్పు గోదావరి జిల్లా పోలీసులు అరెస్టు చేశారు.