రష్యా తమ దేశంపై చేస్తున్న యుద్ధం గురించి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఐక్య రాజ్య సమితి భద్రతా మండలిలో చేసిన ప్రసంగంలో నిప్పులు చెరిగారు. యుద్ధం గురించి ఐరాసలో మాట్లాడిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ.. ఉక్రెయిన్ పట్ల రష్యా తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. రష్యా దాడుల తర్వాత తొలిసారిగా ఐక్య రాజ్య సమితి భద్రతా మండలితో మాట్లాడిన జెలెన్‌స్కీ.. రష్యా సైన్యం నేరాలకు, ఉగ్రసంస్థ ఐసిస్ ఆకృత్యాలకు తేడా లేదన్నారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు ఐరాస తక్షణ చర్యలు చేపట్టాలని జెలెన్‌స్కీ కోరారు. రష్యా సైనికులను యుద్ధ నేరాల కింద విచారించాలని జెలెన్‌స్కీ అభ్యర్థించారు. బుచాలో పౌరులను రష్యా సైన్యం ఉద్దేశపూర్వకంగా చంపిందన్న జెలెన్‌స్కీ... దీనికి ప్రపంచం న్యాయం చేయాలన్నారు. మరోవైపు రష్యా అధ్యక్షుడు పుతిన్ యుద్ధ నేరస్థుడేనని అమెరికా అధ్యక్షుడు బైడెన్ పునరుద్ఘాటించారు. పుతిన్‌ను జవాబుదారీగా చేసి మరిన్ని ఆంక్షలు విధించాలని బైడెన్ కోరారు.