పోలవరం ప్రాజక్టు నిర్మాణ పనులపై ఢిల్లీలోని కేంద్ర జలశక్తి శాఖలో కీలక భేటీ జరిగింది. ఈ భేటీకి తొలుత కేంద్ర జలశక్తి మంత్రి.. ఆ శాఖ కార్యదర్శి, ఏపీకి చెందిన జలవనరుల శాఖ అధికారులు హాజరయ్యారు. ఈ భేటీలో కాఫర్ డ్యాం డిజైన్లపై చర్చ జరిగింది. దిగువ కాఫర్ డ్యాం డిజైన్‌ను ఖరారు చేసినట్లు అధికారులు వెల్లడించారు. మిగిలిన డిజైన్లపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. వచ్చే వారం రోజుల్లో దేశ వ్యాప్తంగా ఉన్న పలువురు నిపుణులతో చర్చించి డిజైన్లపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు కేంద్ర మంత్రి వెల్లడించినట్టు తెలుస్తోంది. ఈనెల 25వరకు ఒక స్పష్టత ఇవ్వాలని అధికారులకు కేంద్ర మంత్రి చెప్పినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈనెల 25 తర్వాత మరోసారి భేటీ అయ్యి సమీక్ష జరపాలని కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్ ఆదేశించినట్లు తెలుస్తోంది.