గత రెండున్నర నెలల నుంచి ఎన్నో వ్యూహాలు, ఎన్నో ఆలోచనలు, ఢిల్లీ నుంచి గల్లీ దాకా లీడర్ల ప్రచారాలు హంగులు ఆర్భాటాలు ప్రలోభాలు ఇలా ఎన్నో అవాంతరాల మధ్య ఉత్కంఠగా సాగినటువంటి హుజురాబాద్ ఉప ఎన్నికలు ముగిసాయి. చిన్న చిన్న చెదురు ముదురు ఘటనలు తప్ప ఎలాంటి అవాంతరాలు లేకుండా హుజరాబాద్ ఉప ఎన్నిక ముగిసింది అని చెప్పవచ్చు. కానీ గత కొన్ని గంటల నుంచి సోషల్ మీడియాలో వీవీ ఫ్యాట్లకు సంబంధించి అవకతవకలు జరిగాయని ప్రచారం జరుగుతోంది. అసలు ఏం జరిగింది..అది ఏంటో తెలుసుకుందాం..?
హుజురాబాద్ ఉప ఎన్నికకు సంబంధించి వీవీ ఫ్యాట్ తరలిస్తున్నారని వీడియో సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది. అధికార పార్టీ చెందిన వ్యక్తులు వివి ప్యాట్లను తారుమారు చేస్తున్నారని కొంతమంది బిజెపి నాయకులు వారిని అడ్డుకున్నారని ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై ఎన్నికల రిటర్నింగ్ అధికారి రవీందర్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరీంనగర్ లో వివి ఫ్యాట్ తరలింపు కలకలం అంతా అబద్ధమని, సోషల్ మీడియా వదంతులు నమ్మవద్దని ఉప ఎన్నికలకు ముందు పనిచేయని వివి ప్యాట్ లను ఒక ప్రభుత్వ అఫీషియల్ వాహనం నుండి మరొక ప్రభుత్వ అఫీషియల్ వాహనంలోకి తరలించామని రిటర్నింగ్ అధికారి తెలిపారు.
వీటిని ఎస్.ఆర్.ఆర్ డిగ్రీ కళాశాల రిసెప్షన్ సెంటర్ రోడ్డు ఎదురుగా నుండి ఒక అధికారిక వాహనం నుండి మరొక అధికారిక వాహనంలో గోదాంకు తీసుకెళ్తుండగా ఎవరో ఈ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారని ఇదంతా నిజం కాదని సోషల్ మీడియా వీడియోలు నమ్మవద్దని, ఉప ఎన్నిక అంతా సజావుగానే సాగింది అని ఎలాంటి అవకతవకలకు తావు లేదని, సోషల్ మీడియా వదంతులు నమ్మి, ఆందోళన చెందవద్దని ఎన్నికల రిటర్నింగ్ అధికారి రవీందర్ రెడ్డి తెలిపారు.