హుజురాబద్ ఉప ఎన్నికల్లో ఘర్షణ వాతావరణం నెలకొంటోంది. ముఖ్యంగా జమ్మికుంట, ఇల్లంతకుంట, వీణ వంక ప్రాంతాలలో ఘ ర్షణ వాతావరణం ఉంది. దీంతో కేంద్ర బలగాలు అప్రమత్తమై, ఘర్షణలకు తావిస్తున్నబీజేపీ, టీఆర్ఎస్ శ్రేణులను నిలువరిస్తున్నా యి. ముఖ్యంగా కొన్ని చోట్ల రిగ్గింగ్ జరిగేందుకు అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే పోలింగ్ శాతం పైనే కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఉదయం 11 గంటల సమయానికి 30 శాతం పైగా నమోదయి ఉందని అంటున్నారు. ఇది మరింత పెరిగేందుకు అవకాశం ఉందా లేదా అన్న సందిగ్ధం కూడా ఉంది. ఉదయం ఏడు గంటలకు ప్రారంభం అయిన పోలింగ్ రాత్రి ఏడు గంటల వరకూ సాగనుంది. కొన్ని విశ్లేషణలు ప్రకారం పోలింగ్ తొంభై శాతానికి చేరుకునే అవకాశం ఉందని అంటున్నా, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఘర్షణలు జరగకుండా ఉంటేనే అది సాధ్యం. ఇక హుజురాబాద్ ఎన్నికల్లో తాను చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ గా టీఆర్ఎస్ కు పనిచేస్తున్నానని చెబుతున్న కౌశిక్ రెడ్డి, సంబంధిత ఐడెంటిటీని ఉపయోగించి ఎక్కడికక్కడ ఘర్షణ వాతావరణానికి కారణం అవుతున్నారు. అయితే ఆయన మాత్రం తనను ఉద్దేశపూర్వకంగానే నిలువరిస్తున్నారని అంటున్నారు. మొత్తం 305 పోలింగ్ కేంద్రాలలో ఎక్కడైనా తిరిగే అవకాశం తనకు ఉందని నిబంధనలే చెబుతుండడంతో ఆ మేరకు తాను నడుచుకుంటున్నానని, ఇదంతా బీజేపీ ఉద్దేశపూర్వకంగా తనపై చేస్తున్న మాటల దాడి లో భాగమేనని కౌశిక్ రెడ్డి స్పష్టత ఇస్తున్నారు.