అచ్చంగా మాట్లాడినా స్వచ్ఛంగా మాట్లాడినా ఎవరి గెలుపు ఎవరిపై ప్రభావం ఉంటుందో చెప్పలేం. ఎవరు ఎంతకాలం నెగ్గుతారో చెప్పలేం. ఎవరు ఎంతకాలం తలొగ్గుతారో కూడా చెప్పలేం. ఏదయితేనేం కాంగ్రెస్ పొమ్మంది బీజేపీ రమ్మంది అన్న లెక్కన తయారయిన తాజా పరిణామాల నేపథ్యంలో ప్రశాంత్ కిశోర్ అనే పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ఇప్పుడు కొత్త పలుకులు పలుకుతున్నాడు. వచ్చే దశాబ్దాలలో దేశాన్ని ఏలేది బీజేపీనే అని చెబుతున్నాడు. ఆ దిశగా రాజకీయం కూడా మారిపోతుందని కూడా అంటున్నాడు. అదే అర్థ ధ్వనితో! ఏం చేయాలి ఏం వినాలి ఎలా మాట్లాడాలి అన్నవి ఎవరికి వారు తెల్సుకోవాలి కనుక ఇప్పుడు రాజకీయాల్లో వస్తున్న పరిణామాలు సంబంధింత మార్పులపై ప్రశాంత్ కిశోర్ చెప్పేవన్నీ నిజాలే అయితే రానున్న కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి సంబంధించి కేంద్రం నుంచి ఆశించేదేమీ ఉండదిక. ఇప్పటికే ఫెడరల్ స్ఫూర్తి పూర్తిగా దెబ్బతిన్న నేపథ్యంలో మోడీ సర్కారు ఇంకొన్నాళ్లు సాగితే బతుకు ఇక సమస్యల వలయంలో ఇంకాస్త ఇరుక్కుని విలవిలలాడడం తథ్యం.