తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పై ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ తీవ్ర విమర్శలు గుప్పించారు. 1994వ సంవత్సరంలో తెలుగు దేశం ప్రభుత్వం అండ దండలతో అగ్రిగోల్డ్ యాజమాన్యం ఎంతో మంది బడుగు బలహీవర్గాలకు చెందిన 30 లక్షల మంది ప్రజలను మోసం చేసిందంటూ గ్రంధి శ్రీనివాస్ ఆరోపణలు చేశారు. సుమారు 300 మంది ఆత్మహత్య చేసుకోవటానికి ముఖ్య కారణం చంద్రబాబు నాయుడు అంటూ గ్రంధి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రేపు 20వేల లోపు ఉన్న అగ్రి గోల్డ్ బాధితులకు తమ ప్రభుత్వం 500కోట్లను వారి అకౌంట్లలో జమ చేస్తుందని గ్రంధి శ్రీనివాస్ వెల్లడించారు. వైఎస్ జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలోనే అగ్రీగోల్డ్ బాధితుల పక్షాన నిలబడ్డారని గ్రంధి శ్రీనివాస్ గుర్తు చేశారు. టీడీపీ హయాంలోనే అగ్రీగోల్డ్ బాధితులకు శఠగోపం పెట్టారంటూ మండిపడ్డారు. ఇదిలా ఉండగా అగ్రిగోల్డ్ బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని ప్రతిపక్షనేత చంద్రబాబు డిమాండ్ చేస్తుంటే వైసీపీ నేతలు అగ్రిగోల్డ్ కష్టాలకు కారణం చంద్రబాబే అని ఆరోపిస్తున్నారు.