ఐదురోజులే పనిదినాలు?
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగుల పనిదినాలను ప్రభుత్వం మరో ఏడాదిపాటు పొడిగించింది. ప్రస్తుతం ఉద్యోగులు సోమవారం నుంచి శుక్రవారం వరకే విధులు నిర్వర్తిస్తున్నారు. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదున్నర గంటల వరకు కార్యాలయాలు పనిచేయనున్నాయి. ఈనెల 27వ తేదీ నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని ప్రభుత్వం ప్రకటించింది. సచివాలయంతోపాటు అన్ని విభాగాలు, కార్పొరేషన్లలో పనిచేసే ఉద్యోగులందరికీ ఇవి వర్తిస్తాయి. అమరావతిని రాజధానిగా ప్రకటించినప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చిన ఉద్యోగుల సౌలభ్యం కోసం గత ప్రభుత్వం వారికి ఐదురోజుల పనిదినాలే కేటాయించింది. కొంతమంది హైదరాబాద్ నుంచి కుటుంబ సమేతంగా వచ్చి ఇక్కడి వాతావరణ పరిస్థితులకు అలవాటుపడటానికి, మరికొందరు వారాంతంలో హైదరాబాద్ వెళ్లిరావడానికి వీలుగా ఐదురోజుల పనిదినాలను ప్రభుత్వం అమలు చేస్తూ వచ్చింది. వీటినే ఇప్పుడు మరో సంవత్సర కాలం పొడిగించారు.