ఏపీలో గత నెలరోజులుగా జూనియర్ డాక్టర్లు తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ ప్రభుత్వానికి వినతీపత్రాలు సమర్పిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ప్రభుత్వం డిమాండ్లను పరిష్కరించడంలో విఫలం అవ్వడంతో ముందుగా చెప్పినట్టుగా నేటి నుండి వారు సమ్మెలోకి దిగుతున్నారు. దాంతో బుధవారం ఓపీ సేవలు నిలిచిపోనున్నాయి. తమకు ఇంటెన్సివ్స్, హెల్త్ ఇన్స్యూరెన్స్, స్టైఫండ్ లో టీడీఎస్ కోత విధించకూడదు, ఫ్రంట్ లైన్ వర్కర్లకు నష్ట పరిహారం ఇవ్వాలంటూ జూడాలు ప్రభుత్వానికి పలు డిమాండ్లు చేశారు. అంతే కాకుండా తమ డిమాండ్లను జూన్ 9వరకూ పరిష్కరించాలంటూ ఆరోగ్యశాఖ అధికారులతో జరిగిన చర్చల్లో చెప్పారు.
లేదంటే సమ్మెకు దిగుతామని తెలిపారు. ఈ రోజుతో ఆ గడువు పూర్తవడంతో సమ్మెలోకి దిగుతున్నారు. ఇక మరోసారి ప్రభుత్వం జూడాలను చర్చలకు ఆహ్వానించింది. మంగళగిరి ఐపీఐఐసీ భవనంలో ఆరోగ్యశాఖ మంత్రి ఆల్ల నాని, డీఎంఈ డాక్టర్ రాఘవేంద్రరావు, ముఖ్య కార్యదర్శి అనిల్ సింఘాల్ జూడాలతో చర్చలు జరపనున్నారు. ఓ వైపు ప్రభుత్వం రిక్వెస్ట్ చేస్తుంటే జూడాలు మాత్రం వినటంలేదు. మరి ఈరోజు చర్చలు ఫలిస్తాయా జూడాలు మాట వింటారా అన్నది చూడాలి.