కరోనా దెబ్బతో మహారాష్ట్ర గజగజా వణికిపోతోంది. రాష్టంలో అత్యంత వేగంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. అనేక జిల్లాలు, నగరాల్లో పరిస్థితి అత్యంత దారుణంగా మారుతోంది. గత వారం రోజుల్లో ఏకంగా మూడు లక్షల మందికిపైగా కరోనా సోకింది. ముంబైలో శనివారం కరోనా కేసులు 9,108 కేసులు నమోదయ్యాయి. మరోవైపు 27 మంది మృతి చెందారు. ఈ క్రమంలోనే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడడంతో మహారాష్ట్రలో విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
ఫైనల్ పరీక్షలు నిర్వహించకుండానే ఒకటి నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులందరూ పాస్ అయినట్టుగా ప్రకటించింది. పాఠశాల విద్యాశాఖ సహాయ మంత్రి వర్ష గ్వైక్వాడ్ ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా తెలియజేసారు. త్వరలోనే 9, 11 తరగతులపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇక 10, 12వ తరగతి బోర్డు పరీక్షలు మాత్రం యథావిధిగా నిర్వహిస్తారు.