ఏపీలో కడప జిల్లాకు చెందిన ఓ యువ క్రికెటర్ ఐపీఎల్‌కు ఎంపికయ్యాడు. ప్రతిష్ఠాత్మకమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్-2021 నిన్న జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కడప జిల్లా రాయచోటి నియోజకవర్గం చిన్నమండెం మండలం బోనమల పంచాయతీ నాగూరువాండ్లపల్లెకు చెందిన మారంరెడ్డి హరిశంకర్ రెడ్డి ఐపీఎల్ క్రికెట్ పోటీలకు ఎంపికయ్యాడు. 22 ఏళ్ల హరిశంకర్ కుడిచేతి వాటం మీడియం పేస్ బౌలర్.
హరిశంకర్‌ను చెన్నై జట్టు రు. 20 లక్షలకు సొంతం చేసుకుంది. ధోనీ, సురేష్ రైనా, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, దీపక్ చాహర్, ఫాప్ డుఫ్లెసిస్, శార్దుల్ ఠాకూర్ వంటి అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లతో ఆడే అదృష్టం అతడికి లభించింది. బాహుబలి వచ్చిన గడ్డ నుంచి హరిశంకర్ వచ్చాడని సీఎస్కే టీమ్ అభివర్ణించింది. ఈమేరకు సీఎస్కే యాజమాన్యం తెలిపింది. ఇది వరకు కడప జిల్లాకే చెందిన పైడికాల్వ విజయ్ కుమార్‌కు కూడా ఐపీఎల్లో ఆడే అవకాశం లభించిన విషయం తెలిసిందే.