భారతీయ గణిత పితామహుడు శ్రీనివాస రామానుజన్ జీవిత విశేషాలు !

SS Marvels
20వ శతాబ్దంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన గణిత మేధావుల్లో ఒకరిగా గుర్తింపు సాధించిన భారతీయుడు శ్రీనివాస రామానుజన్. ఆయన తమిళనాడు రాష్ట్రంలో ఈరోడ్‌లోని కోమలమ్మాళ్, శ్రీనివాస అయ్యంగార్ దంపతులకు 1887 డిసెంబరు 22 న జన్మించారు. ఇక చిన్న వయసులోనే అసాధారణ ప్రతిభను ప్రదర్శించి ఆయిలర్ నియమాలు, త్రికోణమితికి చెందిన అనేక సమస్యలను తన మేధస్సుతో సాధించారు. కేవలం పదమూడేళ్ల వయసుకే ఎస్ఎల్ లోనీ త్రికోణమితిపై రాసిన పుస్తకాన్ని అవపోసాన పట్టడమే కాదు తను సొంతంగా సిద్ధాంతాలు కూడా ప్రారంభించారు. ఇక జీఎస్ కార్ రచించిన సినాప్సిస్ ఆఫ్ ప్యూర్ మ్యాథ్‌మెటిక్స్ అనే పుస్తకం శ్రీనివాస రామానుజన్‌లోని ప్రతిభను బయటకు తీసుకొచ్చింది. అందులోని ఆల్జీబ్రా, అనలిటికల్ జామెట్రీ లాంటి విషయాలకు సంబంధించిన 6,165 సిద్ధాంతాలను నిరూపించడానికి పెద్ద పెద్ద ప్రొఫెసర్లు సైతం నానా తంటాలు పడేవారు. అయితే వారు అవగాహన చేసుకోలేకపోయిన సూత్రాలకు రామానుజన్ ఎలాంటి పుస్తకాల సహాయం లేకుండా అలవోకగా పరిష్కరించారు.



కుంభకోణంలోని ప్రభుత్వ కాలేజీలో చేరిన రామానుజన్ తన దృష్టి పూర్తిగా కేవలం గణితంపై కేంద్రీకరించడంతో ఎఫ్.ఎ. పరీక్షల్లో ఫెయిల్ అయ్యారు. ఆ తర్వాత మద్రాసు లోని వచ్చయ్యప్ప కళాశాలలో చేరిన ఆయన, అక్కడ అధ్యాపకుడు ఎన్.రామానుజాచారి గణిత సమస్యలను కఠినంగా చెప్తుంటే, వాటిని సులభమైన రీతిలో తక్కువ సోపానాలతో సాధించేవాడు. రామానుజన్ ప్రతిభను గుర్తించిన ప్రొఫెసర్ సింగారవేలు మొదలియార్ ఆయనతో కలిసి మ్యాథమెటికల్ జర్నల్స్‌ లో క్లిష్టమైన సమస్యలపై చర్చించి వాటిని సాధించేవారు. 1909లో జానకి అమ్మాళ్‌ను రామానుజన్ వివాహం చేసుకున్నారు. అపారమైన తన గణిత పరిజ్ఞానంతో భారతీయ ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పిన రామానుజన్ బ్రిటన్‌లో ఉన్న సమయంలో ఆరోగ్యం గురించి ఏమాత్రం లెక్కచేయకుండా గణిత పరిశోధనలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయన ఇండియాకు వచ్చిన ఏడాది తర్వాత అంటే 1920 ఏప్రిల్ 26న అనారోగ్యంతో తన 33వ ఏట తమిళనాడు రాష్ట్రంలోని కుంభకోణంలో కన్నుమూశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: