భారీగా తగ్గిన బంగారం డిమాండ్‌ !

NAGARJUNA NAKKA

బంగారానికి అస్సలు బాలేదు. ఏమాత్రం అచ్చిరాలేదు. ఆర్థిక మందగమనం, రికార్డు స్థాయిలో పెరిగిన ధర..  పసిడి గిరాకీని అమాంతం పడేసింది. భారత్‌లో బంగారం డిమాండ్‌ భారీగా తగ్గడంతో...  ధర విలవిల.. గిరాకీ వెలవెలా.. అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి. వలర్డ్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ గోల్డ్‌ ప్రకటించిన తాజా నివేదిక ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. 

 

రికార్డు స్థాయిలో ధర పెరిగిపోవడంతో... బంగారానికి డిమాండ్‌ తగ్గిపోయింది. మార్కెట్‌లో గిరాకీ కూడా అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. 2019లో భారత్‌లో బంగారానికి డిమాండ్‌ 9 శాతం తగ్గి 690.4 టన్నులుగా ఉందని డబ్ల్యూసీజీ తన తాజా నివేదికలో వెల్లడించింది. 2018లో 760.4 టన్నులుగా ఉన్న డిమాండ్‌.. 2019 చివరి నాటికి దేశంలో 10 గ్రాముల పసిడి ధర 39వేల పైకి ఎగబాకడంతో.. ఒక్కసారిగా పడిపోయింది. 

 

2019లో పసిడి దిగుమతులు కూడా భారీగా పడిపోయాయి. 2018లో 755.7 టన్నుల బంగారాన్ని భారత్‌ దిగుమతి చేసుకోగా.. 2019లో అది 14శాతం తగ్గింది. కేవలం 646.8 టన్నుల బంగారాన్ని మాత్రం ఇంపోర్ట్‌ చేసుకుంది. స్థానిక నగల వ్యాపారుల నుంచి డిమాండ్‌ లేకపోవడంతో పాటు.. రిసైకిల్‌ చేసిన పుత్తడి విలువ 37శాతం పెరగడంతో దిగుమతులు తగ్గినట్లు డబ్ల్యూసీజీ అభిప్రాయపడింది.

 

దేశీయంగా బంగారం ధర రికార్డు స్థాయిలో పెరగడం.. ఆర్థికస్థితి కుదేలవడం వంటి పరిస్థితులు.. 2019లో పసిడి విక్రయాలపై తీవ్ర ప్రభావం చూపించాయి. ధన త్రయోదశి లాంటి ముఖ్యమైన రోజుల్లోనూ బంగారం కొనుగోళ్లు అంతంతమాత్రంగానే నమోదయ్యాయి. అయితే పెళ్లిళ్ల సీజన్‌ ముందు కాస్త డిమాండ్‌ పెరిగింది. 

 

2020లో మాత్రం బంగారానికి మళ్లీ మంచి రోజులు వచ్చే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యాపార వర్గాల్లో వ్యక్తమవుతోంది. బడ్జెట్‌లో తీసుకొచ్చే ఆర్థిక సంస్కరణలతో కొనుగోళ్లు పెరగొచ్చని బిజినెస్‌ ఎక్స్‌పర్ట్స్‌ ఆశిస్తున్నారు. ఈ ఏడాది 700 నుంచి800 టన్నుల పసిడికి గిరాకీ లభించొచ్చని అంచనా వేస్తున్నారు. బంగారం దిగుమతులపై కస్టమ్స్‌ సుంకాన్ని 10శాతానికి తగ్గిస్తే దిగుమతులు పెరిగే అవకాశమూ ఉందంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: