బరువు తగ్గాలంటే ఇలా చేయండి..!

ప్రతి ఒక్కరూ సొసైటీలో చాలా అందంగా  మంచి ఫిజిక్ తో కనిపించాలనుకుంటారు. ముఖ్యంగా మహిళలు వివాహం అనంతరం వారి శరీరంలో చాలా మార్పులు రావడం లావు కావడం జరుగుతుంది. దీంతో సన్నబడటానికి రక రకాల వ్యాయామాలు, యోగ, డైటింగ్ లాంటివి చేస్తుంటారు.  అధిక బరువు ఇప్పుడు అందరిలోనూ ప్రధాన సమస్యగా మారింది. రోజు రోజుకు పెరిగిపోతున్న బరువును తగ్గించుకోలేక, తిండి విషయంలో నోరును కట్టుకోలేక మరింత బరువు పెరుగిపోతున్నారు. బరువు పెరగడానికి జన్యుపరమైన కారణాలకంటే తినే ఆహారంపై అవగాహన లేకపోవడమే ప్రధాన కారణమంటున్నారు వైద్యులు. తిండి విషయంలో చాలా మంది సరైన శ్రద్ధ తీసుకోరు. ఎక్కడ పడితే అక్కడ, ఏది పడితే అది తినేస్తుంటారు. దీంతో బాడీలో కేలరీలు పెరిగిపోయి త్వరగా లావెక్కుతున్నారు. ఇది రాను రాను మరింత ఇబ్బందుల పాలు చేస్తోంది. పనికే కాదు, నడవాడానికి కూడా ఒళ్లంగని పరిస్థితి తయారవుతుంది.

 

ఆహారం విషయంలో కాస్త శ్రద్ధ వహిస్తే పుష్టిగా తింటూనే సుష్టిగా ఉండచ్చని వైద్యుల సలహా. ముఖ్యంగా జంక్‌ఫుడ్స్‌, ఆయిల్‌ ఫుడ్‌ లాంటి వాటికి దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. అనవసరమైన వాటిని అధిక మోతాదులో తీసుకోవడం కంటే శక్తినిచ్చే ఆహారాన్ని తక్కువ మొత్తంలో తీసుకుంటే మన బాడీకి ఆటోమెటిక్‌గా కేలరీలు  చేకూరుతాయి. గింజధాన్యాలు, ప్రాసెస్ చేయని తృణధాన్యాలు సంపూర్ణ పోషకాహారాన్ని అందిస్తాయి. ఇందుకోసం రాగులు, మొక్కజొన్న, జొన్న, సజ్జ వంటి గింజధాన్యాలను ఎక్కువగా తీసుకోవడం మంచిది. వైట్ రైస్ తీసుకోవడానికి బదులుగా ఎరుపు, నలుపు లేదా గోధుమ పదార్థాలను తీసుకునేందుకు ట్రైచేయండి. ముఖ్యంగా ఉదయం పూట టిఫిన్స్‌లో ఇవి ఉండేలా చూసుకోవాలి. వీటి వల్ల బరువును నియంత్రణలో ఉంచుకోవచ్చు.

 

పప్పుల్లో కూడా సోయా, శనగ వంటివాటిని తీసుకోవాలి. వీటిని రెండురోజులకోసారి భోజనంలో భాగం చేస్తుండాలి. ఒకవేళ మాంసాహారం తినాల్సి వస్తే కొవ్వు తక్కువగా ఉన్న మాంసాన్ని తీసుకోండి. రుతువులకు అనుగుణంగా వచ్చే పండ్లను తీసుకోవడం మరువద్దు. ఇలాంటి వాటిని రోజుకు రెండైనా తీసుకుంటూ ఉండాలి. ఇవి మన బాడీకి ఫైబర్లను అందించడమే కాకుండా విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్‌ను శరీరానికి అందిస్తాయి.

మనం రోజువారీ తినే పదార్థాల నుంచే 15 శాతం కొవ్వు వచ్చి చేరుతుంది. కాబట్టి మాంసం, వెన్న, నెయ్యి, జున్ను, క్రీమ్ వంటి వాటిని తీసుకోవడం తగ్గించాలి. కొవ్వు తక్కువుగా ఉండే పాలు, పాల పదార్థాలను తీసుకోవాలి. ప్రత్యేకించి ఒకే నూనెను కాకుండా.. అన్ని నూనెలను మార్చిమార్చి వంటల్లో ఉపయోగిస్తుండాలి. కుకీలు, స్నాక్ ఫుడ్ ఐటెమ్స్ తీసుకోవడం తగ్గించేయాలి. శరీరానికి అవసరమైన కేలరీల్లో కనీసం 10 శాతం కంటే తక్కువగా చక్కెరను మాత్రమే తీసుకోవాలి. చక్కెర తక్కువగా వేసుకుని కాఫీ, టీలను తాగడం మంచిది. అన్నిటికంటే ముఖ్యమైనది... మూడుపూట్ల అన్నం తినేవారు కొందరు పని ఒత్తిడి అంటూ ఓ పూట భోంచేయడం మానేస్తారు. అలాంటి పని చేయనేకూడదు. మూడు పూటలా బ్యాలెన్స్ చేసుకుంటూ భోజనం తీసుకోవాలి. పిల్లలకు సీజన్లో వచ్చే పళ్లను స్నాక్స్‌గా ఇస్తే మంచిది. ఫ్రిజ్ లో కూల్ డ్రింకులు, ప్యాక్డ్ ఫ్రూట్ జ్యూస్ పెట్టి వాటిని తాగడం మానేయడం మంచిది.

 

టీవీ చూస్తూ చాలా మంది భోజనం చేస్తుంటారు. దీనివల్ల తినాల్సిన ఆహారం కంటే మనకు తెలియకుండానే మరింత ఎక్కువగా తినేస్తున్నామని ఇటీవల సర్వేల్లో తేలింది.  ఏడుపు సీన్లు వచ్చినప్పుడు ఉద్వేగం చెందుతూ, కామెడీ సీన్లకు నవ్వుకుంటూ, కోపంతో ఉండే సీన్లను చూసి ఆవేశంతోనూ ఇలా చేస్తుంటారు. దీనివల్ల ఎక్కువ ఆహారం తిని లావెక్కుతామన్న విషయాన్ని గుర్తుంచుకోండి. బరువు తగ్గాలంటే శారీరక శ్రమ తప్పనిసరి, నగర జీవితంలో ఇది తక్కువైనా వ్యాయామం చేయడం మర్చిపోవద్దు. ప్రతి రోజు కనీసం 30 నుంచి 45 నిమిషాలు తప్పనిసరిగా వ్యాయామం చేయాలి. ఇలా చేస్తే అధిక బరువుతో అల్లాడిపోతూ వైద్యుడి చుట్టూ తిరగాల్సిన అవసరం రాదు.

మీకు అధిక బరువు ప్రధాన సమస్యగా మారితే ఇష్టమొచ్చిన పదార్థాలను ఎలాబడితే అలా లాగించడం కంటే కాస్త నోరు కట్టేసుకోవడం మంచిది. అదేవిధంగా వ్యాయామం చేస్తూ వెయిట్‌ తగ్గించుకోవచ్చు అంటున్నారు డైటీషియన్స్‌.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: