మెట్రోకు భారీన‌ష్టం.. ఎందుకో తెలుసా!

Thanniru harish
తెలంగాణ‌లో క‌రోనా సెకండ్ వేవ్ వ్యాప్తి వేగంగా పెరుగుతుంది. ఫ‌లితంగా రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా న‌మోద‌వుతున్నాయి. సోమ‌వారం రాత్రి 8గంట‌ల వ‌ర‌కు 1,22,143 క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా కొత్త‌గా 5,926పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. ఒక్క‌రోజులోనే 18మంది క‌రోనాతో మృత్యువాత ప‌డ్డారు. ఈ క్ర‌మంలో ప్ర‌జ‌లు బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు వ‌ణికిపోతున్నారు. ఒక‌వేళ అత్య‌వ‌స‌ర‌మై  బ‌య‌ట‌కు రావాల్సివ‌చ్చినా సొంత వాహ‌నాల వినియోగానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఈ క్ర‌మంలో భాగ్య‌న‌గ‌రంలోని మెట్రోకు ప్ర‌యాణీకుల తాకిడి త‌గ్గి కోట్లాది రూపాయ‌ల న‌ష్టం వాటిల్లితుంద‌ట‌.

న‌గ‌రంలో పెరుగుతున్న ప్ర‌యాణీకుల ర‌ద్దీని దృష్టిలో ఉంచుకొని ప్ర‌భుత్వం మెట్రో ర‌వాణాను అందుబాటులోకి తెచ్చింది. మెట్రో రైళ్లు ప్రారంభమైన త‌రువాత ప్ర‌తీరోజు రెండుల‌క్ష‌ల మంది ప్ర‌యాణీకులు మెట్రోలో ప్ర‌యాణాలు సాగించారు. దీంతో భారీగా ఆదాయం స‌మ‌కూరింది. గ‌తేడాది మార్చిలో వ‌చ్చిన క‌రోనాతో కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు లాక్‌డౌన్‌ను విధించ‌డంతో మెట్రో స‌ర్వీస్సులు నిలిచిపోయాయి. కొద్దికాలానికి కేంద్రం క్ర‌మ‌క్ర‌మంగా ఒక్కో రంగానికి నిబంధ‌న‌లు స‌డ‌లించ‌డంతో గ‌తేడాది చివ‌రిలో భాగ్య‌న‌గ‌రంలో మెట్రో స‌ర్వీస్సులు తిరిగి ప్రారంభ‌మ‌య్యాయి. స‌ర్వీస్సులు ప్రారంభ‌మైనా మెట్రోలో ప్ర‌యాణాలు సాగించేందుకు న‌గ‌ర‌వాసులు అంత‌గా ఆస‌క్తి చూపించ‌లేదు.

దీంతో మెట్రో న‌ష్టాల్లోనే న‌డుస్తూ వ‌స్తుంది. తాజాగా మ‌ళ్లీ సెకండ్‌వేవ్ క‌రోనా విజృంభిస్తుండ‌టంతో మెట్రోలో ప్ర‌యాణం చేయాలంటేనే ప్ర‌యాణీకులు వెనుక‌డుగు వేస్తున్నారు. మెట్రో ఏసీ బోగీలు కావ‌డంతో పాటు, క‌రోనా సోకిన‌వారు ఎక్కితే వైర‌స్ మ‌న‌కు ఎక్క‌డ అంటుకుంటుంద‌నే భ‌యంతో మెట్రో ప్ర‌యాణానికి ఆస‌క్తిచూప‌డం లేదు. సొంత వాహ‌నాలు, క్యాబ్‌ల ద్వారానే అధిక‌శాతం మంది త‌మ గ‌మ్య‌స్థానాల‌కు చేరుతున్నారు. క‌రోనా నిబంధ‌న‌లు అమ‌లుచేస్తూ ప్ర‌స్తుతం మెట్రో స‌ర్వీస్సులు న‌డుస్తున్నా.. ప‌లు రూట్‌ల‌లో న‌డిచే మెట్రో రైళ్ల‌లో కేవ‌లం ప‌దుల‌ సంఖ్య‌లోనే ప్ర‌యాణీకులు ఎక్కుతుండ‌టంతో కోట్లాది రూపాయ‌ల న‌ష్టం వ‌స్తున్న‌ట్లు మెట్రో నిర్వాహ‌కులు పేర్కొంటున్నారు. ఈ క్ర‌మంలో క‌రోనా స‌కండ్ వేవ్ త‌గ్గేవ‌ర‌కు ప‌లు రూట్‌ల‌లో మెట్రో స‌ర్వీస్సులు నిలిపివేసేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు స‌మాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: