పీవీ సింధుకూ తప్పని వేధింపులు.. ఎంతగా అంటే..?
ఇలాంటి వేధింపులు తాను ఎదుర్కొన్నానంటోంది పీవీ సింధు.. హైదరాబాద్ పోలీస్ మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పీవీ సింధు పాల్గొన్నారు. తాను కూడా సైబర్ బుల్లింగ్, సైబర్ ట్రోలింగ్ ను ఎదుర్కొన్నానని తెలిపారు. అయితే మహిళలు ధైర్యంగా ఎదుర్కొని పోలీస్ శాఖలోని సైబర్ సెల్ కు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఇంటర్నెట్ వినియోగం నిత్య జీవితంలో భాగమైపోయిందని.. ఇంటర్నెట్ వినియోగం వల్ల మంచితో పాటు చెడును కూడా పిల్లలకు గ్రహిస్తున్నారని పీవీ సింధు అన్నారు.
ఈ విషయంలో తల్లిదండ్రులు పిల్లలను జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలని పీవీ సింధు అన్నారు. హైదరాబాద్ పోలీసులు విద్యార్థులను సైబర్ వారియర్లుగా తీర్చిదిద్దడం అభినందనీయం అని ప్రశంసించిన పీవీ సింధు.. కొవిడ్ వల్ల రెండున్నరేళ్లుగా ఇంటర్నెట్ వినియోగం పెరిగిందని.. అయితే.. సైబర్ నేరాలు కూడా అదే స్థాయిలో పెరిగాయని గుర్తు చేశారు. మహిళల భద్రతకు షీ టీమ్ లో ఎంతో కృషి చేస్తున్నాయన్న పీవీ సింధు.. సైబర్ నేరాలబారిన పడ్డ బాధితులకు తగిన మనోధైర్యాన్ని ఇచ్చే వేదిక అవసరం ఎంతైనా ఉందన్నారు.
అవును నిజమే.. వేధింపులకు గురయ్యే అమ్మాయిలకు ధైర్యం చెప్పే వేదికలు రావాలి.. లేకపోతే.. ఆ అమ్మాయిలు ఆత్మన్యూనతకు గురై.. ఎవరికీ చెప్పుకోలేక.. పరిస్థితులను ఎదిరించలేక డిప్రెషన్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. అందుకే... వేధింపులకు గురయ్యే అమ్మాయిలను అండగా నిలబడే ఓ వేదిక ఉండాలంటున్నారు పీవీ సింధు.