
మహిళ మౌనమెందుకు.... మేలుకో!
నిత్యది ప్రేమ పెళ్లి కావడంతో పుట్టింటి వాళ్లకు దూరమైంది. భర్త అరకొర జీతంతో ఇల్లు గడవడం కష్టమైంది. ఇంట్లో గొడవలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఆమె గర్భవతి. భర్త చేయిచేసుకుంటుంటే ఎవరితో చెప్పుకోవాలో తెలియని పరిస్థితి..
181 హెల్ప్‌లైన్‌కి గతేడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మార్చి వరకూ తెలంగాణలో 10,338 గృహహింసకు సంబంధించిన ఫిర్యాదులు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌లోనూ ఈ సంఖ్య 1103గా ఉంది
కుటుంబంలో సమస్యలు సహజమే అయినా అవి సర్దుబాటు చేసుకోలేని స్థితిలో ఉంటే మధ్యవర్తి సాయం తీసుకోవడానికి వెనకాడొద్దు. ఈ విషయంలో మొదట ఇరువైపుల పెద్దల సాయం తీసుకోండి. ఈ క్రమంలో బాధితురాలికి కుటుంబం, సన్నిహితుల సహకారం ఎంతో అవసరం. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే... భరోసా కేంద్రాలు, వన్‌స్టాప్ సెంటర్లు, ఆన్‌లైన్ కౌన్సెలింగ్ కేంద్రాల సాయం తీసుకోండి. నిపుణుల సలహాలతో మీ సమస్య పరిష్కారం కావొచ్చు.
మనదేశంలో గృహ హింసకి సంబంధించిన ఫిర్యాదులను జాతీయ మహిళా కమిషన్ వాట్సాప్ నెంబర్: 72177-35372లో లేదా ఆ సంస్థ వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయొచ్చు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో బాధితులెవరైనా 181, 100 టోల్‌ఫ్రీ నంబర్లకు ఫోన్ చేస్తే తక్షణం సంబంధిత పోలీస్‌స్టేషన్‌కు ఆ సమాచారం చేరుతుంది. వారు బాధిత మహిళలను కాపాడతారు.
ఆంధ్రప్రదేశ్‌లో దిశ పోలీస్‌స్టేషన్లు, వన్‌స్టాప్ కేంద్రాలు, ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్లు మహిళలపై హింసను నిరోధించేందుకు సాయం చేస్తున్నాయి. ఈ కేంద్రాల్లో ఉచిత న్యాయ, వైద్య, పోలీస్ సేవలు అందుతాయి. ఇవి కాక రెండు రాష్ట్రాల్లోనూ భూమిక స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ 18004252908 ఇరవై నాలుగ్గంటలూ అందుబాటులో ఉంటుంది. హైదరాబాద్‌లో మైఛాయిస్, షాహీన్ వంటి సంస్థలు పనిచేస్తున్నాయి. ఆన్‌లైన్‌లో ‘ఇన్విజిబుల్ స్కార్స్’ వంటి వేదికల్లోనూ మీ బాధల్ని చెప్పుకోవచ్చు.