అమ్మ: కడుపుతో ఉన్న వాళ్లు వీటిని అస్సలు తినకండి.. ఎందుకంటే..!?

N.ANJI
గర్భధారణ సమయంలో గర్భిణులు ఆహార సమయంలో చాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కొన్నిసార్లు తినకూడని పదార్దాలు తినడం వలన గర్భస్రావం అవుతుంది. అయితే ఎలాంటి ఆహార పదార్దాలు తినకూడదో చూద్దామా. కెఫిన్ ఎక్కువగా ఉండే కాఫీని గర్భిణులు ఎక్కువగా తీసుకోకూడదు. ఇది బిడ్డ ఎదుగుదలపై ప్రభావం చూపుతుంది. దీనివల్ల గర్భస్రావం, పిండం బరువు పెరగకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి.

అయితే కలబందలో ఔషధ గుణాలు ఉంటాయి. కానీ వీటిల్లో ఉండే ఆంత్రాక్వినోన్స్‌ వల్ల గర్భాశ్రయం సంకోచించే ప్రమాదం ఉంది. దీనివల్ల గర్భిణులకు రక్తస్రావం అయ్యి, గర్భస్రావం అయ్యే అవకాశం ఉంది. ములక్కాయల్లో ఆల్ఫా సిటోస్టెరాల్ అనే ఎంజైమ్‌లు ఉంటాయి. ఇవి గర్భిణులకు హాని చేస్తాయి. కానీ వీటిల్లో అధిక మొత్తంలో ఉండే ఐరన్, పొటాషియం, విటమిన్లు శరీరానికి అవసరం. అందువల్ల గర్భిణులు తరచుగా కాకుండా.. తక్కువ మొత్తంలో ఎప్పుడో ఒకసారి ములక్కాయలతో చేసిన పదార్థాలను తీసుకోవచ్చు.

ఇక గర్భిణులు తీసుకునే ఆహారంలో నువ్వులను చేర్చకుండా జాగ్రత్తపడాలి. వీటిల్లో తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు అనే రెండు రకాలు ఉంటాయి. వీటిని తేనెతో కలిపి తీసుకుంటే నెలలు నిండకముందే ప్రసవమయ్యే అవకాశం ఉంది. గర్భిణులు వేడి చేయని, పాశ్చరైజేషన్ చేయని పాలను తీసుకోకూడదు. వాటితో చేసే పదార్థాలకు కూడా దూరంగా ఉండాలి. ఇవి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. జంతువుల మాంసంలో కాలేయం పోషకాలకు నిలయంగా ఉంటుంది. ఆరోగ్యంగా ఉంటే చికెన్, మటన్‌ నుంచి తీసిన కాలేయాన్ని తీసుకోవచ్చు. కానీ మార్కెట్లో వ్యాధులు సోకిన మేక, గొర్రెల మాంసాన్ని కూడా అమ్ముతారు. ఇలాంటి ఇన్‌ఫెక్షన్ సోకిన జంతువుల లివర్‌లో ఉండే టాక్సిన్లు గర్భిణులకు ప్రమాదకరంగా మారుతాయి.

ఇక స్వచ్ఛమైన బంగాళాదుంపలతో చేసిన పదార్థాలను ఎవరైనా తీసుకోవచ్చు. కానీ అవి మొలకెత్తినప్పుడు మాత్రం ప్రమాదకరంగా మారుతాయి. ఇవి తల్లీ బిడ్డల ఆరోగ్యాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది. బొప్పాయి వల్ల గర్భస్రావం అవుతుందని పెద్దవాళ్లు చెబుతుంటారు. ఇది గర్భిణులకు హాని చేస్తుంది. సరిగ్గా పండని గ్రీన్ బొప్పాయిలో ఉండే ఎంజైమ్‌లు గర్భాశ్రయం సంకోచించేలా చేస్తాయి. దీనివల్ల గర్భస్రావం కావచ్చునని నిపుణులు చెబుతున్నారు. పైనాపిల్‌లో బ్రొమెలైన్ అనే పోషకం ఉంటుంది. ఇది గర్భాశయాన్ని వదులుగా, సున్నితంగా చేస్తుంది. దీని వల్ల తల్లి అసౌకర్యానికి గురవుతుంది. ఫలితంగా నెలలు నిండకముందే ప్రసవమయ్యే అవకాశం ఉంది. అందువల్ల ప్రసవం అయ్యేంత వరకు పైనాపిల్‌ను తీసుకోకపోవడమే మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: