అమ్మ: గర్భిణీ స్త్రీలు ప్రయాణం చేయడం మంచిదేనా..!?

N.ANJI
గర్భధారణ సమయంలో మహిళలు చాల జాగ్రత్తలు పాటించాలి. అయితే చాల మంది మహిళలు గర్భధారణ సమయంలో ప్రయాణాలు చేస్తుంటారు. గర్భం ధరించిన సమయంలో స్త్రీలు సరైన జాగ్రత్తలు తీసుకుంటూ, అవసరమైతే వైద్యులను సంప్రదిస్తూ ఆరోగ్యాన్ని కాపాడు కోవాలన్నారు. ఇక ముఖ్యంగా ప్రయాణ సమయాల్లో తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తల గురించి తెలుసుకుందామా..!
అయితే గర్భిణులు దూర ప్రయాణం ఎక్కువ సమయం చేయడం మంచిది కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే ముఖ్యంగా మూడు నెలలలోపు, నెలలు నిండి ప్రసవ సమయం దగ్గర పడినప్పుడు.. హై బిపి, మధుమేహవ్యాధి ఉన్నప్పుడు, తల తిరగడం, వికారం, వాంతులవడం, రక్తస్రావం అయినప్పుడు అటువంటి గర్భవతులు ప్రయాణాలు చేయకపోవడమే మంచిది.
ఇక మూడు నెలలు నుండి ఎనిమిది నెలల లోపు అవసరమైతే గర్భిణీ స్త్రీ వైద్యుల సలహాతో ప్రయాణం చేయడం మంచిది. గర్భస్థ శిశువుకు, గర్భవతికి సుఖంగా ఉండేలా, ఇబ్బందులు కలగకుండా ఉండేలా ప్రయాణం చేయాలి. ఇరుకుగా ఉన్న సీట్లల్లోనూ, కుదుపులు ఎక్కువగా ఉన్న రోడ్ల మీద ప్రయాణం చేయకూడదు. అత్యవసర పరిస్థితి ఏర్పడి ఎక్కువ దూరం కారులో ప్రయాణం చేయవలసివస్తే మధ్య మధ్య కొంతసేపు కారు ఆపుకొని, ఇటూ అటూ నాలుగు అడుగులు వేయడం, శక్తినిచ్చే ఆహారపదార్థాలు తీసుకోవడం మంచిది. ప్రసవమయ్యే సమయపు నెలలు దగ్గర పడుతున్నప్పుడు కారు డ్రైవింగ్‌ చేయడం అంతగా మంచిది కాదు.
గర్భిణీ స్త్రీలు ఎనిమిది నెలల నుండి ప్రసవమయ్యే వరకూ ప్రయాణం చేయడం మంచిది కాదు. మరీ అవసరమైతే విమానంలోనూ, రైల్లోనూ డాక్టరును సంప్రదించి ప్రయాణం చేయాలన్నారు. అవసరమైన దూదులు, టానిక్ లు, నెల తప్పినప్పటి నుంచీ తాను వాడిన మందుల చీటీలు, వైద్యపరీక్షకు సంబంధించిన కాగితాలను వెంట ఉంచుకోవాలి. సాధ్యమైనంత వరకూ, ఏడు నెలలు దాటిన తర్వాత, గర్భవతి ప్రయాణం చేయకపోవడమే మంచిది. అంతేకాకుండా, వెంట తోడు లేకుండా ఒంటరి ప్రయాణం చేయకపోతే మంచిది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: