అలొవెరాతో మీ సౌందర్యాన్ని మరింత పెంచుకోండి.. !!
ఆడవాళ్లకు అందం అంటే చాలా ఇష్టం. ఆ అందాన్ని కాపాడుకోవడం కోసం అలోవెరా ఉపయోగిస్తే మంచి ప్రయోజనాలు కనిపిస్తాయి. ముఖంపై ఉన్న మచ్చలను తొలగించుకోవాలంటే.. అలోవెరా ఉపయోగించాల్సిందే. ముఖంపై మచ్చలు, పొడి చర్మం, ఇతరత్రా చర్మ సమస్యలున్న వారు రోజూ అలొవేరా జ్యూస్‌ను రాసుకుంటే మచ్చలు తగ్గుముఖం పడతాయి. తలలో చుండ్రు ఇబ్బంది పెడుతుంటే... ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసంలో రెండు టేబుల్స్పూన్ల అలోవెరా జెల్ ని కలిపి వెంట్రుకల కుదుళ్లకు పట్టించాలి. అరగంట తర్వాత చల్లటి నీళ్లతో కడిగేయాలి. ఇలా రెగ్యులర్‌గా చేస్తే సమస్య పరిష్కారమవుతుంది.
అలోవెరా జ్యూస్ ను రాత్రిపూట ముఖానికి రాసుకుని ఉదయం లేవగానే గోరు వెచ్చని నీటితో ముఖాన్ని కడిగేస్తే... చర్మ సౌందర్యం మెరుగవుతుంది. అలోవెరాను శుభ్రంగా కడిగి.. తొక్కతో పాటు మిక్సీలో రుబ్బుకుని పేస్టులా ముఖానికి, చేతులు, కాళ్లు, మెడకు పట్టించి అరగంట తర్వాత స్నానం చేస్తే చర్మం మిలమిల మెరిసిపోతుంది. చర్మ వ్యాధులు నయమవుతాయి. మొటిమలు, మచ్చలకు చెక్ పెట్టాలంటే... రాత్రి పడుకునే ముందు మచ్చల మీద అలోవెరా జెల్ అప్లై చేసి ఉదయాన్నే చల్లటి నీటితో కడిగితే మార్పు కనిపిస్తుంది. చిక్కుబడిన వెంట్రుకలు సులభంగా విడిపోవాలంటే.. అలోవెరా జెల్ రాస్తే సరి.
కళ్లకింద ఉండే నల్లటి వలయాలు పోవాలంటే రెండు టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్ లో ఒక టేబుల్ స్పూన్ బాదం ఆయిల్ కలిపి పేస్టులా చేసుకోవాలి. రాత్రి పడుకునే ముందు నల్లటి వలయాల మీద ఆ జెల్ అప్లై చేయాలి. ఇలా వారంరోజులు చేస్తే నల్లటి వలయాలు మాయం. అలోవెరాలోని మాలిక్ యాసిడ్ చర్మం మీద ముడుతలను తొలగిస్తుంది. చర్మానికి సాగే గుణాన్ని పెంచుతుంది. చర్మాన్ని తేమగా ఉంచి.. అందాన్ని రెట్టింపు చేస్తుంది. పాదాలపై ఏర్పడ్డ పగుళ్లు తొలగి పోవాలంటే.. అలోవెరా గుజ్జును పాదాలకు రాయండి. రాత్రంతా అలాగే ఉంచి.. ఉదయాన్నే గోరువెచ్చటి నీళ్లతో కడిగేయాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తే.. మీ పాదాలు సుకుమారంగా అవుతాయి.