అమ్మ‌కానికి అమ్మాయిలు..!

T Bhoomesh

మ‌న దేశంలో అమ్మాయిల‌కు ర‌క్ష‌ణ లేకుండా పోతోంది. అమ్మాయిలు క‌నిపించ‌డం లేదంటూ న‌మోద‌వుతున్న కేసుల సంఖ్య నానాటికి పెరిగి పోతోంది. ముఖ్యంగా చిన్నారులు, అమ్మాయిలు ఆచూకీ లేకుండా పోతున్నారు. ఇది ఏదో ఒక రాష్ట్రానికి ప‌రిమితం కాలేదు, దేశ వ్యాప్తంగా ఇదే స‌మ‌స్య నెల‌కొంది. ఇందుకు ప్ర‌ధాన కారణం మానవ అక్రమ రవాణా అనడంలో సందేహం లేదు. కేంద్రం, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినా ఈ సమస్య తీవ్రతను మాత్రం తగ్గించలేకపోతున్నాయి.


 దేశంలోని పలు రాష్ట్రాల్లోని అమ్మాయిలను చిన్నతనంలో కిడ్నాప్ చేయడం, లేదా మాయమాటలు చెప్పి కొనుగోలు చేయడం ద్వారా వారిని వ్యభిచార కూపాల్లోకి నెడుతున్నారు. దేశంలోనే గాక, విదేశాలకు కూడా వీరిని తరలిస్తుండటం ఆందోళన కలిగించే అంశం. ఇండియాలో అమ్మాయిల అక్రమ తరలింపులో అస్సాం రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. దేశంలోని పలు రెడ్‌లైట్ ప్రాంతాల్లో సాగుతున్న వ్యభిచార కేంద్రాల్లో అసోం అమ్మాయిలను హాట్ కేకుల్లా విక్రయిస్తున్నారని తెలుస్తోంది.


దేశ రాజధాని ఢిల్లీలోని రెడ్‌లైట్ ప్రాంతంలో ప‌ట్టుబ‌డుతున్న అమ్మాయిల్లో ఎక్కువ శాతం మంది అసోంకు చెందిన వారే ఉండటం గ‌మ‌నార్హం. ఇటీవ‌ల ఢిల్లీలోని ఓ రెడ్ లైట్ ఏరియాలో దాడులు చేసి ఓ 12ఏళ్ల అమ్మాయిని వ్యభిచార కూపం నుంచి విముక్తి కల్పించారు. ఆ అమ్మాయిని సాక్షాత్తు అమ్మమ్మే వ్యభిచార ముఠాకు విక్రయించిందని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఆర్థిక కార‌ణాలే అమ్మాయిల విక్ర‌యానికి ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని సామాజిక వేత్త‌లు చెబుతున్నారు.


ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, అహ్మదాబాద్, చెన్నై లాంటి నగరాలతోపాటు నేపాల్, సౌదీ లాంటి ఇతర విదేశాలకు సైతం అమ్మాయిలను అక్రమంగా రవాణా చేసి వారిని వ్యభిచార కూపంలో దించుతున్నారనే వాస్తవాలు తాజా అధ్యయనాల్లో వెల్లడయ్యాయి. జాతీయ నేర గణాంక సంస్థ విడుదల చేసిన నివేదికలో అసోం అమ్మాయిల అక్రమ రవాణాకు కేంద్రంగా మారిందని స్పష్టం అయింది.


 బాలికల అక్రమ రవాణా కేసులు అసోంలోనే ఎక్కువ‌గా నమోదవడంపై మహిళా, ప్రజా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జాతీయ నేర గణాంక సంస్థ వెల్లడించిన లెక్కల కంటే రెట్టింపు మంది అమ్మాయిలు వ్యభిచార రొంపిలో దింపుతున్నారని స్వచ్ఛందసంస్థల ప్రతినిధులు అంటున్నారు. పేదరికం, నిరక్షరాస్యత, ఆర్ధిక వెనుక‌బాటు వల్ల గిరిజన కుటుంబాలకు చెందిన అమ్మాయిలు వ్యభిచార రొంపిలో దిగుతున్నారని తాజా అధ్య‌య‌నాల్లో తేలింది.
మ‌హిళ‌లు, చిన్నారుల అక్ర‌మ ర‌వాణాలో అసోం ప్ర‌థ‌మ స్థానంలో ఉండ‌గా ఆ త‌ర్వాత వ‌రుస‌గా పశ్చిమబెంగాల్, త‌మిళనాడు, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: