విజయం మీదే : దీర్ఘకాలిక లక్ష్యాలను ఎంచుకుని శ్రమిస్తే ఏ పనిలోనైనా విజయం మీ సొంతం

Reddy P Rajasekhar
ప్రతి మనిషికి కెరీర్ లో సక్సెస్ ఎంతో అవసరం. అయితే సక్సెస్ సాధించడం సులువు కాదు. ప్రపంచంలోని కుబేరులు దీర్ఘకాలిక లక్ష్యాలతో ఘన విజయాలను అందుకోవచ్చని నిరూపించారు. 300 రూపాయలతో ఉద్యోగిగా జీవితాన్ని ప్రారంభించిన ధీరూబాయ్ అంబానీ జనం నిత్యం వాడే ఉత్పత్తులు, సేవలు తన సంస్థ ద్వారానే అందించాలని ముందడుగులు వేసి సక్సెస్ అయ్యారు. మనకంటూ స్పష్టమైన లక్ష్యం ఉంటే విజయం సాధించడం సులభమే.
 
జీవితంలో చాలామంది దీర్ఘకాలిక లక్ష్యాలను ఏర్పరచుకుంటారు. అయితే ప్రయత్నాలు మొదలుపెట్టిన తరువాత చిన్నచిన్న ఓటములు ఎదురైతే భయాందోళనకు గురై అక్కడితో ఆగిపోతూ ఉంటారు. జీవితంలో మనం ఉన్నత స్థానాలకు ఎదిగే ముందు ఓటమి పాఠాలు ఎన్నో నేర్పుతాయి. వాటి నుంచి వచ్చిన అనుభవాలు మనం మరిన్ని విజయాలు అందుకునేలా చేస్తాయి. ప్రామాణికమైన లక్ష్యాలు ఏర్పర్చుకోవడం వల్ల గెలుపు ఆలస్యంగానైనా సొంతమవుతుంది.
 
శ్రమతో కూడిన ప్రయత్నం, సామర్థ్యం మనల్ని విజయతీరాలకు చేరుస్తుంది. లక్ష్యం లేకపోతే మనం ఎటు పయనిస్తున్నామో తెలియక అంధత్వంలో పడిపోయే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరి జీవితంలో లక్ష్యం అనేది ఎంతో ప్రధానం. జీవితంలో మనం ఉన్నత స్థానాలకు చేరాలంటే నిత్య పరిశోధన, జ్ఞానం ఎంతో అవసరం. మార్కెట్ అవసరాలు, డిమాండ్ ను దృష్టిలో ఉంచుకుని మనం చేసే ప్రయత్నాలు వ్యాపారాలను అగ్రస్థానంలో నిలబెడతాయి.
 
ప్రతి ఒక్కరూ లక్ష్యాలను ఎంచుకుంటారు. కానీ కొందరు మాత్రమే సక్సెస్ సాధిస్తారు. లక్ష్యాన్ని చేరుకోవడానికి మనం మొదట తగిన మార్గాన్ని ఎంచుకోవాలి. లక్ష్య సాధనలో అవసరమైనవేమిటి? అనవసరమైనవేమిటి? అని రెండు వర్గాలుగా విభజించుకొని అవసరమైన వాటికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలి. అప్పుడే మనం అనుకున్న విజయాలను అందుకోగలుగుతాం. చిన్నచిన్న సమస్యలు, ఆటంకాలు వచ్చినా ధైర్యంగా ముందడుగులు వేస్తే విజయం సాధించడం సాధ్యమే. విజయం సాధించే చివరి నిమిషం వరకు ప్రయత్నిస్తూనే ఉండాలి. ఈ విధంగా శ్రమిస్తే అనుకున్న లక్ష్యాలను సాధించడంతో పాటు ఉన్నత స్థానాల్లో నిలుస్తాం.


 
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: