విజయం మీదే : ఆశయం గొప్పదైతే సక్సెస్ కు అదే తొలిమెట్టు
మనం జీవితంలో చేసే ప్రతి పనిలో సక్సెస్ సాధించాలని అనుకుంటూ ఉంటాం. కానీ కొన్ని పనుల్లో సక్సెస్ సాధిస్తే మరికొన్ని పనుల్లో ఫెయిల్ అవుతూ ఉంటాం. ఏ పనిలోనైనా సక్సెస్ సాధించాలంటే అసాధారణ పరిస్థితుల కోసం ఎదురు చూడకూడదు. సాధారణ పరిస్థితుల్లోనే సక్సెస్ కోసం శ్రమించాలి. ఆశయం గొప్పదైతే సక్సెస్ కు అదే తొలిమెట్టు అవుతుంది. "జీవించు నీ జీవితం... సాధించు నీ ఆశయం... తలవంచావా అపజయమే... ఎదురించావా విజయం నీదే" అన్నాడో మహాకవి.
లక్ష్యాన్ని సాధించాలంటే ప్రతి క్షణం కష్టపడాలి. లక్ష్యాన్ని చేధించే దిశగా కసరత్తు చేయాలి. కష్టపడితేనే ఎవరికైనా విజయం సొంతమవుతుంది. మృగరాజు అయినంత మాత్రాన సింహానికి ఆహారం నోట్లోకి వచ్చి పడదు. అదే విధంగా శ్రమించకుండా సక్సెస్ ఎవరికీ సొంతం కాదు. కష్టపడిన వాళ్లు సక్సెస్ అవుతారు. కష్టపడని వాళ్లు ఫెయిల్ అవుతారు. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మనం సులభంగా సక్సెస్ ను సాధించవచ్చు.
మనం జీవితంలో ఎంచుకున్న ఆశయాన్ని ఒకరోజులో సాధించలేం. ఆ లక్ష్యానికి తగిన విధంగా శ్రమిస్తే మాత్రమే ఫలితం దక్కుతుంది. యద్భావం తద్భవతి అనే మాటను తరచూ వింటూ ఉంటాం. మన భావాలను వాస్తవరూపంలోకి తీసుకురావడమే అసలైన విజయం. మన ఆలోచనలే మాటలుగా చేతలుగా మారి సక్సెస్ సొంతమవుతుంది. ఏ పనినైనా మనపై మనకు పూర్తి నమ్మకం ఉంటే మాత్రమే మొదలుపెట్టాలి.నమ్మకం లేకుండా పనులను మొదలుపెడితే సక్సెస్ సాధించలేం.
ఉన్నతమైన ఆశయాలతో పాటు ఆత్మవిశ్వాసం కలిగి ఉండటం చాలా ముఖ్యం. వైఫల్యాల గురించి ఎక్కువగా మాట్లాడే వాళ్లకు మనం దూరంగా ఉండాలి. వాళ్లు మనల్ని ప్రభావితం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. విజేత అంటే మనం సక్సెస్ సాధించడం మాత్రమే కాదు. మనం సక్సెస్ అవుతూ తోటివాళ్లు సక్సెస్ సాధించడానికి మనవంతు కృషి చేయాలి.