విజయం మీదే : ఫెయిల్యూర్ తో స్నేహం చేస్తూ సక్సెస్ కోసం ప్రయత్నిస్తే సులువుగా విజయం మీ సొంతం

Reddy P Rajasekhar
ప్రతి ఒక్కరి జీవితంలో జయాపజయాలు సహజం. విజయం సాధించినంత మాత్రాన సంతోషపడాల్సిన అవసరం లేదు. ఓటమి పాలైనంత మాత్రాన కృంగిపోవాల్సిన అవసరం లేదు. కెరీర్ మొదట్లో ఎదురుదెబ్బలు తగిలిన వాళ్లే నేడు ఉన్నత శిఖరాలను అధిరోహించారు. జీవితంలో ఓటమి మనకు పాఠం నేర్పుతుంది. అలా ఓటమి నుంచి పాఠాలు నేర్చుకున్న వాళ్లే నేడు ప్రపంచాన్ని ప్రభావితం చేయగల వ్యక్తులుగా ఎదిగారు.
 
ఓటమి విజయానికి మార్గం చూపుతుంది. శాస్త్రవేత్తలు ఆవిష్కర్తలు అనుభవపూర్వకంగా ఈ మాటను చెప్పారు. ఓటమి తర్వాత వచ్చే గెలుపు ఇచ్చే కిక్కే వేరు. లక్ష్యాన్ని సాధించే క్రమంలో ఎదురయ్యే ఫెయిల్యూర్స్ నుంచి కొత్త పాఠాలు, కొత్త విషయాలను నేర్చుకుంటూ ముందుకు వెళితే మాత్రమే సక్సెస్ సాధించగలం. ఫెయిల్యూర్ ను నెగిటివ్ గా భావించకుండా మనం ఎందుకు ఫెయిల్ అయ్యామో ఎక్కడ ఫెయిల్ అయ్యామో ఆలోచించాలి.
 
మన ఫెయిల్యూర్ కు తప్పనిసరిగా కొన్ని కారణాలు ఉంటాయి. ఆ కారణాలను అన్వేషించి వాటిని సరిదిద్దుకునేందుకు ప్రయత్నించాలి. అందుకోసం అవసరమైతే స్నేహితుల సలహాలు, సూచనలు తీసుకోవాలి. మన బలహీనతలను అధిగమిస్తూ బలాలను పెంచుకుంటూ సక్సెస్ వైపు అడుగులు వేయాలి. కష్టపడిన వాళ్లకు ఆలస్యంగానైనా ఫలితం దక్కుతుందని గుర్తుంచుకోవాలి.
 
విద్యుత్ బల్బు తయారీ కోసం చేసిన ప్రయత్నాల్లో దాదాపు 3,000 సార్లు థామస్ అల్వా ఎడిసన్ విఫలమయ్యారు. అన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా ఆయన ప్రయత్నాన్ని ఆపలేదు. చివరికి అనుకున్నది సాధించారు. జపాన్ దిగ్గజ సంస్థల్లో ఒకటైన సోనీ మొదట్లో ఫెయిల్యూర్స్ ను చవిచూసింది. అదే సంస్థ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరించి మంచి పేరు సంపాదించింది. ఫెయిల్యూర్ ను పాజిటివ్ గా తీసుకుని గతంలో చేసిన తప్పులను పునరావృతం కాకుండా సక్సెస్ కోసం ప్రయత్నిస్తే జీవితంలో సులభంగా ఉన్నత స్థానాలకు ఎదగగలుగుతాం. కెరీర్ లో సక్సెస్ సాధిస్తామని మనపై మనకు నమ్మకం ఉండాలి. అలా నమ్మకం ఉంచుకుని శ్రమిస్తే నమ్మకమే విజయం సాధించేలా చేస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: