వైఎస్ విగ్రహం ఏర్పాటు సరే ... మరి దేవాలయాల మాటో ?

Yadav B Sridhar

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో బెజవాడ పోలీస్ కంట్రోల్ రూమ్ వద్ద ఏర్పాటు చేసిన దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని టిడిపి సర్కార్ గతం లో తొలగించింది . వైఎస్ విగ్రహాన్ని తొలగించడం  అప్పట్లో పెను వివాదానికి దారి తీసింది.  వైయస్ విగ్రహాన్ని బాబు సర్కార్ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా నే తొలిగించిందని  అప్పట్లో వైకాపా నేతలు ఆందోళన నిర్వహించారు.  అయితే రోడ్డుకు అడ్డంగా ఉన్నందు వల్లే  వైఎస్  విగ్రహాన్ని  తొలగించామని టిడిపి నేతలు అప్పట్లో వాదించారు. 


ప్రభుత్వం మారింది ... వైకాపా  అధికారంలోకి వచ్చింది.  వైకాపా అధికారం లోకి వచ్చిన తరువాత వైఎస్  విగ్రహాన్ని తిరిగి యథా స్థానం లో  ఏర్పాటు చేయాలనీ నిర్ణయించారు .  వైఎస్ విగ్రహాన్ని యథా స్థానం లో  ఇటీవల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించారు .   అయితే టిడిపి ప్రభుత్వ హయాంలో విజయవాడలో జరిగిన కృష్ణా పుష్కరాల సమయంలో 64 దేవాలయాలు,  అందులో ఉన్న దేవతా విగ్రహాలను రోడ్డు  అభివృద్ధి కి అడ్డంగా ఉన్నాయని తొలిగించారు.  టిడిపి ప్రభుత్వం నిర్ణయాన్నిఅప్పట్లో  హిందూ సంస్థలు,  స్వామీజీలు,  పీఠాధిపతులు తప్పుపట్టారు.  హిందువుల మనోభావాలతో  టిడిపి సర్కార్ ఆడు కుంటుందని విమర్శించారు . అంతటితో ఆగకుండా  నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు . విజయవాడలో ధర్నా నిర్వహించారు .


విజయవాడలో రోడ్డు అభివృద్ధి పేరిట కూల్చివేసిన ఆలయాలను వైకాపా అధికారంలోకి వస్తే తిరిగి  పునరుద్ధరిస్తామని  ప్రస్తుత దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ,  నాటి వైసీపీ నగర అధ్యక్షుడు హోదా లో హామీ ఇచ్చారు . టీడీపీ ప్రభుత్వ హయాం  పోలీస్ కంట్రోల్ రూమ్ వద్ద నుంచి తొలిగించిన  వైఎస్ విగ్రహాన్ని యధాస్థానం లో ఏర్పాటు చేసిన  జగన్ ప్రభుత్వం,  అదే విధంగా  దేవాలయాలను పునరుద్ధరించడం లో అంతటి  ఉత్సాహాన్ని  చూపించడం లేదన్న విమర్శలు విన్పిస్తున్నాయి .


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: