ఫోటోలకు ఫోజులు ఇస్తుండగానే ట్విస్ట్ పెళ్లికూతురు బ్యాగ్ మాయం!

Amruth kumar
జైపూర్‌లోని జగత్‌పురా ఏరియాలో ఉన్న 'చందన్ వన్' మ్యారేజ్ గార్డెన్‌లో ఫిబ్రవరి 7న నవీన్ కరోల్ వివాహం అంగరంగ వైభవంగా జరుగుతోంది. బంధుమిత్రుల కోలాహలం, డీజేల మోత, లైట్ల వెలుగుల మధ్య వధూవరులు వేదికపై ముసిముసి నవ్వులు చిందిస్తూ ఫోటోలకు ఫోజులిస్తున్నారు. సరిగ్గా రాత్రి 10:15 గంటల సమయం.. అక్కడే అసలైన 'ట్విస్ట్' మొదలైంది.సాధారణంగా దొంగ అంటే ఎలా ఉంటాడో మనందరికీ ఒక అంచనా ఉంటుంది. కానీ ఈ దొంగ చాలా స్మార్ట్! ఖరీదైన ప్యాంటు, షర్టు, పైన ఒక బ్లేజర్ (కోటు) వేసుకుని దర్జాగా వేదికపైకి వచ్చాడు. ఎవరికీ ఏమాత్రం అనుమానం రాకుండా నూతన దంపతుల వెనుక తిరుగుతూ, వాళ్ల బంధువులాగే యాక్ట్ చేశాడు. వధూవరులు ఫొటోగ్రాఫర్ వైపు చూస్తూ నవ్వుతున్న ఆ సెకన్ల వ్యవధిలో.. పెళ్లి కూతురు పక్కనే సోఫాలో ఉన్న హ్యాండ్‌బ్యాగ్‌ను మెల్లగా లాగేసి, తన బ్లేజర్ లోపల దాచుకుని నెమ్మదిగా అక్కడి నుంచి జారుకున్నాడు.



పెళ్లి వీడియో తీస్తున్న ఫోటోగ్రాఫర్ లైవ్ కెమెరాలో ఈ దృశ్యాలన్నీ రికార్డయ్యాయి. ఫోటో షూట్ అయిపోయిన తర్వాత బ్యాగ్ కోసం వెతగ్గా అది కనిపించలేదు. అందులో రూ. 4 లక్షల నగదుతో పాటు విలువైన బంగారు ఆభరణాలు ఉన్నాయి. కంగారుపడిన కుటుంబ సభ్యులు వెంటనే వీడియో ఫుటేజీని పరిశీలించగా, ఆ 'సూటు-బూటు' వేసుకున్న దొంగ భాగోతం బయటపడింది.ఇలాంటి ఘటనలు ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువవుతున్నాయి. పెళ్లిళ్లలో జరిగే చోరీల వెనుక కొన్ని ప్రత్యేకమైన గ్యాంగులు పని చేస్తున్నాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు.వీరు ఖరీదైన బట్టలు వేసుకుని వస్తారు కాబట్టి ఎవరూ గుర్తుపట్టలేరు.ముఖ్యంగా వధూవరుల వద్ద ఉండే గిఫ్ట్ బాక్సులు, నగలు ఉన్న బ్యాగులే వీరి మెయిన్ టార్గెట్.అందరూ భోజనాల దగ్గర లేదా ఫోటో షూట్ల దగ్గర బిజీగా ఉన్నప్పుడే వీరు పని పూర్తి చేస్తారు.



జైపూర్ ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీడియో ఆధారంగా నిందితుడి కోసం గాలింపు మొదలైంది. కానీ పోయిన సొమ్ము దొరుకుతుందో లేదో తెలీదు. కాబట్టి, పెళ్లి సందడిలో ఉన్నప్పుడు ఆనందం ఎంత ముఖ్యమో, మన వస్తువుల భద్రత కూడా అంతే ముఖ్యం. బీ కేర్ ఫుల్!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: