ట్రాఫిక్ నియంత్రణకు పోలీసులు, అధికారులు ఎన్నో రకాల కొత్త రూల్స్ తెచ్చి పెడుతున్నారు. పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యను దృష్టిలో పెట్టుకొని దాన్ని కంట్రోల్ చేసేందుకు అదే స్థాయిలో కొత్త కొత్త ట్రాపిక్ రూల్స్ తీసుకొస్తున్నారు.అయితే ఎంతో కట్టుదిట్టంగా ట్రాఫిక్ రూల్స్ తీసుకొస్తున్నా.. నిత్యం రోడ్డు ప్రమాదాలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనాలపై వెళ్లే వారు అనేకరకాల ప్రమాదాల బారిన పడి చనిపోతున్నారు.హెల్మెట్ ధరిస్తే ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చని తెలిసినా.. చాలా మంది అలసత్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. హెల్మెట్లు లేకుండానే రోడ్లు మీద బైక్లు నడుపుతూ ఉంటారు.దీంతో ప్రమాదాలకు చెక్ పెట్టేందుకు ప్రజల రక్షణ కోసం ప్రభుత్వం.. నిబంధనలు మరింత కఠినతరం చేస్తోంది. హెల్మెట్లు ధరించకపోతే చలాన్లు విధిస్తోంది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే ట్రాఫిక్ పోలీసులు విధించే జరిమానాలు చాలా భారీగా ఉంటున్నాయి. అసలు వాహనంలో వెళ్లడంకంటే ప్రభుత్వం అధీనంలో నడిచే బస్సుల్లో ప్రయాణం చేయడం మంచిదన్న ఆలోచన చేస్తున్నారు వాహనదారులు. కొత్తగా కేంద్రం తీసుకొచ్చిన జరిమానాలు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి.హెల్మెట్ పెట్టుకోకుంటే రూ.500 నుంచి 1000 వరకు ఉంటుంది.అయితే హెల్మెట్ పెట్టుకోలేదని ఓ వాహనదారుడికి ట్రాఫిక్ పోలీసులు ఏకంగా లక్ష చలానాను జారీ చేశారు. లక్ష చలానా చెల్లించాలని ఫోన్‌కు వచ్చిన సందేశంను చూసి అతడు ఒక్కసారిగా కంగుతిన్నాడు. ఈ ఘటన బీహార్‌లోని సుపాల్‌లో చోటుచేసుకుంది.
వివరాల ప్రకారం… మహ్మద్ అఫ్రోజ్ ఆలం అనే వ్యక్తి గత ఆగస్టు 4న హెల్మెట్ లేకుండా సుపాల్‌లో ప్రయాణించాడు. డిగ్రీ కాలేజ్ చౌక్‌లో ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ లేకుండా వెళుతున్న అఫ్రోజ్ బైక్ ఫోటో తీశారు. ఆ సమయంలో రూ.1,000 చలానా విధించారు. కొన్నిరోజులకు అఫ్రోజ్ మొబైల్‌కు రూ.1,01,000 చలానా కట్టాలంటూ మెసేజ్ వచ్చింది. ఇది చూసిన అతడి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. వెంటనే ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. అయినా కూడా ఇప్పటివరకు చలానాలో సవరణ జరగలేదు. అఫ్రోజ్ చలానాకు సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.ఈ చలానాను సుపాల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ కృష్ణబలి సింగ్ జారీ చేసినట్లు తెలుస్తోంది. హెల్మెట్ లేకుండా బైక్ నడిపినందుకు రూ.1000 జరిమానా విధించగా.. పొరపాటుగా రూ.1,01,000గా పడిందట. ఇది మానవ తప్పిదమని జిల్లా రవాణా అధికారి శశిశేఖరం పేర్కొన్నారు. 2014లో సుమారు రూ.65 వేలకు తన బైక్‌ను కొనుగోలు చేశానని.. రూ.1,01,000 చలానా ఉందని మహ్మద్ అఫ్రోజ్ ఆలం చెప్పాడు. తనది పేద కుటుంబం అని, అధికారులు త్వరగా చలానాను సవరించాలని కోరాడు.ఈ నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు రోడ్డు పై కనిపిస్తే చాలు బైకుపై వెళ్లే వాహనదారుడు మరో దారి వెతుక్కుంటాడు. జరిమానాతో పోలీసులు జేబులకు చిల్లుపడేలా చేస్తారనే భయంతో వాహనదారుడు ఇతర మార్గాల కోసం వెతుకుతాడు.