కరోనా వైరస్ అమెరికాలో పుట్టిందా?
అయితే ఆ నివేదిక ఇంకా రాకముందే కరోనా వైరస్ అమెరికాలోనే పుట్టిందని చైనా ఆరోపిస్తోంది. అమెరికా సైన్యానికి చెందిన ఫోర్టు డెట్రిక్ నుంచే కరోనా వైరస్ పుట్టిందని చెబుతోంది. ఒకప్పుడు అమెరికాలోని ఫోర్టు డెట్రిక్ జీవ ఆయుధాల కార్యక్రమానికి కేంద్రంగా ఉండేది. ఇప్పుడు అక్కడ మశూచి, ఎబోలా వంటి వైరస్ లను పరిశోధించే ల్యాబులు ఉన్నాయి. దీంతో కరోనా వైరస్ అక్కడే పుట్టి ఉంటుందనే ఆలోచనను చైనా రేకెత్తిస్తోంది. దీనిపై విచారణ జరిపేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులను రప్పించాలని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ ఈ రెండు రోజుల క్రితం మళ్లీ డిమాండ్ చేశారు. కరోనా వైరస్ పుట్టుక గురించి అమెరికా ఇంటెలిజెన్స్ నివేదిక కోరడం సైన్సుకు వ్యతిరేకమని చైనా అంటోంది. అమెరికా తన రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చిపెట్టే నివేదిక కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వహించిన పరిశోధనను పక్కకు పెడుతోందని విమర్శిస్తోంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణుల బృందం మాత్రం చైనాలోని వుహాన్ మార్కెట్ లో అమ్మకానికి వచ్చిన ఓ జీవి నుంచి కరోనా వైరస్ వ్యాప్తి చెందినట్టు చెప్పింది. గబ్బిలాల్లోని కరోనా వైరస్ ను అధ్యయనం చేస్తున్న వుహాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ నుంచి కరోనా వైరస్ లీక్ కాలేదంది. అయితే కొందరు శాస్త్రవేత్తలు దీనిని తిరస్కరించారు. మరోవైపు అమెరికా ఇంటెలిజెన్స్ కు కూడా కరోనా వైరస్ ఎక్కడ పుట్టిందో కచ్చితంగా తెలవడంలేదని తెలుస్తోంది. ప్రపంచ దేశాలు కరోనా వైరస్ ను ఎలా కట్టడి చేయాలని సతమతమవుతుంటే దాని పుట్టుక కోసం గొడవలెందుకని పలు దేశాలు విస్మయం చెందుతున్నాయి.