పల్నాడు: ఎట్టకేలకు సిద్దమైన కొత్త బైపాస్..రయ్..రయ్ మంటూ దూసుకుపోతున్న వాహనదారులు.!

FARMANULLA SHAIK
దేశంలోని అతిపెద్ద జాతీయ రహదారుల్లో చెన్నై- కోల్కతా జాతీయ రహదారి NH-16 అతి ముఖ్యమైనది. ఈ రహదారి అటు చెన్నై నుంచి ఇటు కలకత్తా వరకు ప్రయాణిస్తూ ఉత్తర దక్షిణ భారతదేశాలకు వారధిగా నిలుస్తుంది. అంతటి ప్రాముఖ్యత కలిగిన ఈ రహదారి ఆంధ్రప్రదేశ్ లో సుమారు వెయ్యి కిలోమీటర్ల మేర ప్రయాణిస్తుంది. దీంతో ఈ రహదారి నిత్యం రద్దీగా ఉంటుంది. ఈ రోడ్ లో గంటకు కొన్ని వేల వాహనాలు ప్రయాణిస్తాయి. పలనాడు జిల్లాలో ని ప్రధాన పట్టణమైన చిలకలూరిపేట పట్టణం నడిబొడ్డు నుండి NH-16 రహదారి వెళ్తుంది. దీంతో ఉదయం సమయంలో పట్టణంలో విపరీతమైన ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయి. చిలకలూరిపేట పట్టణంలో ట్రాఫిక్ సమస్యను నివారించడానికి బైపాస్ రోడ్డు నిర్మించడం తప్ప మరో మార్గం లేకుండా పోయింది.దీంతో సర్వాంగ సుందరంగా అధునాతనంగా ఆహ్లాదకరంగా రక్షణాత్మకంగా పర్యావరణహితంగా చిలకలూరిపేట బైపాస్‌ అందుబాటులోకి వచ్చేసింది. ఎన్నో ఏళ్లుగా.. చిలకలూరిపేటవాసుల కలగా చిలకలూరిపేట మీదగా రాకపోకలు సాగిస్తూ ఇబ్బంది పడే వారి కష్టాలను తీరుస్తూ ఎట్టకేలకు బైపాస్‌ నిర్మాణం జరిగింది. 


16వ నంబరు జాతీయ రహదారిపై గుంటూరు, ఒంగోలు మధ్య చిలకలూరిపేట పట్టణాన్ని బైపాస్‌ చేస్తూ సుమారు రూ.వెయ్యి కోట్ల వ్యయంతో 16.384 కిలోమీటర్ల మేర ఆరు వరుసల్లో నిర్మాణం చేశారు. దేశంలోనే మొదటిసారిగా మోడల్‌ బైపాస్‌గా రూపొందించబడింది.ఇదిలావుండగా రోడ్డు నిర్మాణం పనులు పూర్తయినట్లుగా బీఎస్‌సీపీఎల్‌ కంపెనీ కాంట్రాక్టర్లు నేషనల్‌ హైవే సంస్థకు నివేదించారు. దీంతో హైవేస్‌ అధికారులు పనుల నాణ్యతా ప్రమాణాల పరిశీలన ఇటీవలే ముగిసింది. ఈ క్రమంలో చిలకలూరిపేట బైపాస్‌ రోడ్డులో రాకపోకల్ని అమరావతి పీఐయూ ఎన్‌హెచ్‌ పీడీ టి.పార్వతీశం కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. వాస్తవానికి గత నెల 29న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖ పర్యటనకు రావాల్సింది. అదే రోజు వర్చువల్‌ విధానంలో చిలకలూరిపేట బైపాస్‌ ప్రారంభించాల్సి ఉంది.. కానీ తుఫాన్ కారణంగా ఆ పర్యటన వాయిదా పడింది. ఇప్పుడు బైపాస్‌ను ప్రారంభించారు.అనంతరం అక్కడి నుంచి తిమ్మాపురం దగ్గరకు వెళ్లే సమయానికి భారీ వర్షం పడింది. కొద్దిసేపటికి వర్షం తగ్గిన తర్వాత తిమ్మాపురం వైపు నుంచి ఒంగోలు వైపు రాకపోకలను కూడా ప్రారంభించారు. అయితే త్వరలోనే ఈ రహదారిని ప్రధాని చేతుల మీదుగా జాతికి అంకితం చేయనున్నట్లు తెలుస్తోంది.మొత్తం మీద ఏపీలో నేషనల్ హైవే ప్రాజెక్టులు, ఫ్లై ఓవర్ల నిర్మాణాలు ఊపందుకున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: