అమ్మో డిజిటల్ కరెన్సీ.. ఈ విధంగా మారుతోందా..!

MOHAN BABU
కరోనా ప్రజలకు చాలా పాఠాలను నేర్పింది. కరెన్సీ కాగితాలను తీసుకోవడానికి భయపడే రోజుల్లో డిజిటల్ కరెన్సీ బాగా పెరిగింది. అదే అలవాటు కొనసాగుతోంది. ముందు ముందు ఇంకా పెరుగుతుందే, కానీ తగ్గే అవకాశమే కనిపించడం లేదు. టీ స్టాల్ నుంచి పెద్ద పెద్ద మాల్స్ వరకు డిజిటల్ కరెన్సీకే జై కొడుతున్నారు. ఇప్పుడు అందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉంటున్నాయి. దీంతో డిజిటల్ చెల్లింపులు కూడా ఈజీ అయ్యాయి. మనం ఇప్పుడు డిజిటల్ ప్రపంచంలో నివసిస్తున్నాం. కరెన్సీ కాగితాల కు బదులుగా ఆన్లైన్ చెల్లింపులే ఎక్కువవుతున్నాయి. పల్లె నుంచి మహానగరం వరకు డిజిటల్ కరెన్సీ వాడకమే కొనసాగుతోంది. కరోనా కష్టకాలంలో మొదలైన ఈ తరహా చెల్లింపుల వ్యవస్థ భవిష్యత్తులో మరింత వేగంగా విస్తరిస్తూ సమస్త వ్యాపార రంగాలను ఆకట్టుకోబోతోంది.

 తెలంగాణలోని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సాగుతున్న డిజిటల్ లావాదేవీల గురించి అక్కడ చిరువ్యాపారులు ఎంతో సంతోషంగా చెబుతున్నారు. గతంలో చిల్లర లేకపోతే వ్యాపారం పోయేది, డబ్బులు సరిపోకపోతే తీసుకున్న సరుకులు కూడా వదిలిపెట్టి వెళ్లే వాళ్ళు, ఇప్పుడు పేటిఎం లు, గూగుల్ పేల ద్వారా డబ్బులు చెల్లించడంతో చిల్లర సమస్య తీరిందని కస్టమర్లతో తగాదాలు కూడా లేవని చెబుతున్నారు. తాము  చెల్లించాల్సిన వారికి కూడా ఆన్లైన్ లోనే చెల్లిస్తున్నామంటున్నారు వ్యాపారులు. ఒకప్పుడు చిల్లర లేకపోతే వ్యాపారాలు ఆగిపోయేవి, ఇప్పుడు డిజిటల్ పేమెంట్ లేదంటే వ్యాపారాలు పోతున్నాయి.

అందుకే రోడ్డు పక్కన టీ కొట్టు , కూరగాయలు అమ్ముకునే వారు సైతం డిజిటల్ పేమెంట్ వ్యవస్థ ఏర్పాటు చేసుకుంటున్నారు. వ్యాపారులు సైతం బ్యాంకులకు వెళ్లకుండా తాము చెల్లించవలసిన వారికి సైతం  ఆన్లైన్ లోనే డబ్బులు పంపిస్తున్నారు. క్రమంగా దేశంలో కరెన్సీ వాడకం తగ్గుతుంది. నగదు చెల్లింపులకు బదులుగా డిజిటల్ చెల్లింపులు పెరిగినప్పటికీ కొందరు డిజిటల్ చెల్లింపుల్లోనూ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. డబ్బులు ట్రాన్స్ ఫర్ చేయకుండానే మెసేజ్ లు పంపి మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని బ్యాంకర్లు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: