టెక్నాలజీ మన బ్రెయిన్‌ని ఎలా హైజాక్ చేస్తుందో తెలుసుకుందామా..?

MOHAN BABU
నేను  చాలా అపరాధ భావంతో ఉన్నాను.  ఈ మాట అన్నది ఎవరో కాదు,  ఫేస్బుక్ సంస్థలో యూజర్లని పెంచే  విభాగానికి ఉపాధ్యక్షుడిగా ఉన్న ఛామత్ అన్న మాటలు ఇవి. “యూజర్ల యొక్క  ప్రవర్తనను హైజాక్ చేయడం కోసం, బ్రెయిన్‌లో  విడుదలయ్యే డోపమిన్ రసాయనాన్ని  ఆసరాగా చేసుకుని ఆల్గారిథమ్స్ రూపొందించాం,  ఇప్పుడు అది సమాజాన్ని అడిక్షన్ వైపు నెట్టేస్తోంది” అంటూ స్టాన్‌ఫర్డ్ యూనివర్శిటీలో  జరిగిన ఒక సెమినార్‌లో  అతను అభిప్రాయం వెల్లడించారు. మళ్లీమళ్లీ రోజుకు కొన్ని వందల సార్లు మనం ఫోన్ ఓపెన్ చేసి,  ఫేస్బుక్,  వాట్సప్,  టిక్ టాక్, పబ్‌జీ వంటి వాటికి బానిసలుగా మారామంటే  దీని ప్రధాన కారణం మన బ్రెయిన్ లో వివిధ న్యూరో ట్రాన్స్‌మిటర్ ద్వారా  విడుదలయ్యే డోపమిన్ అనే  రసాయనం.  చాలామంది తమ ఫోన్ ఎక్కడైనా పెట్టి మర్చిపోతే,  అది దొరికేటంత వరకూ  చాలా ఆందోళన చెందుతారు. 73 శాతం మంది ఇదే తరహా ప్రవర్తన కలిగి ఉంటారని ఒక అధ్యయనంలో వెల్లడైంది. ఒక స్మార్ట్ఫోన్ వినియోగదారుడు రోజుకి  మూడు నుండి ఐదు గంటల పాటు ఫోన్ మీద టాపింగ్, టైపింగ్, స్వైపింగ్ చేస్తూ గడుపుతున్నాడు
                      *డోపమిన్ ఇలా*
ఒక పని మళ్లీ మళ్లీ చేయాలనిపిస్తోంది అంటే  దానికి ప్రధాన కారణం మన బ్రెయిన్ లో ఉత్పత్తి అయ్యే డోపమిన్  అనే రసాయనం.  రుచికరమైన ఆహారం తిన్నప్పుడు,  శారీరక వ్యాయామం చేసినప్పుడు, సెక్స్‌లో పాల్గొన్నప్పుడు,  మరీ ముఖ్యంగా సమాజంలో ఇతరులతో మెరుగైన సంబంధబాంధవ్యాలు కలిగి ఉన్నప్పుడు మన ప్రమేయం లేకుండానే మన బ్రెయిన్‌లో ఈ డోపమిన్  విడుదలవుతుంది.  మనల్ని  సంతోష పెడుతుంది కాబట్టి దీనిని ప్లెజర్ హార్మోన్ అంటారు..ఆ సంతోషంలో మనం చేసే పని అడిక్షన్ స్థాయికి వెళ్లిందన్న విషయం కూడా గుర్తించలేం.. పబ్‌జీ, టిక్‌టాక్ వంటి యాప్స్ అడిక్షన్ గురించి  ఇటీవల పలు మార్లు టీవీ చర్చల్లో నేను పాల్గొన్నప్పుడు వాటికి  అలవాటు పడిన అనేకమంది నుండి “మేం అడిక్ట్ అవలేదు..  చాలా సంతోషంగా ఉన్నాం” అనే స్పందన స్వయంగా విన్నాను. అడిక్షన్ ఏదైనా  ఒక మాదిరి  సంతోషాన్ని అందిస్తుంది. ఆ సంతోషం చాలు అనుకుంటున్నారు కాబట్టే  వాటిని మళ్ళీ మళ్ళీ వాడుతున్నారు. గేమ్ ఆడేటప్పుడు ఒక లెవల్ దాటినప్పుడూ.. స్క్రీన్ మీద మీరు ఏదో సాధించినట్లు ఫ్లాష్ అయ్యే  గ్రాఫిక్స్ చూసినప్పుడూ.. టిక్ టాక్  వీడియోలకు పెద్ద మొత్తంలో వచ్చే కామెంట్లు, లైక్‌లు  చూసినప్పుడు మన బ్రెయిన్ లో రిలీజ్ అయ్యే డోపమిన్  మళ్లీ మళ్లీ అదే పని చేసేలా ప్రేరేపిస్తుంది..
                  *రివార్డులకి స్పందిస్తూ*
ఒక పని చేస్తే దానికి తగిన నజరానా  లభిస్తుంది అనుకున్నప్పుడు.. బ్రెయిన్‌లోని డోపమిన్  ఉత్పత్తి చేసే పాత్‌వే‌లు  యాక్టివ్ గా పనిచేయడం మొదలుపెడతాయి.  ఒక ప్రవర్తన,  దాని ద్వారా ఓ నజరానా  ఆశించడం -  ఈ రెండు రకాల పనులు ఎప్పటికీ తెగని ఓ  ప్రవాహంలా అలా కొనసాగుతూనే ఉంటాయి. ఈ కారణంచేతే ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ఎప్పటికప్పుడు ఫేస్బుక్ ప్రొఫైల్ పిక్స్ మారుస్తారు.  అలా మార్చిన వెంటనే వందల కొద్ది లైక్స్ కోసం  ఆశపడుతుంటారు.  అలా లైక్స్ వచ్చిన వెంటనే బ్రెయిన్‌లో డోపమిన్  తగినంత స్థాయిలో విడుదల అవుతుంది.. అప్పటికి సంతృప్తి అన్పిస్తుంది.  మరికొంత సమయం తరువాత మళ్లీ అదే స్థాయిలో,  లేదా అంతకంటే మరింత ఎక్కువ మోతాదులో డోపమిన్ రసాయనం  కావాలి అనిపిస్తుంది.  దానికోసం,  మరిన్ని లైకులు సాధించడం కోసం..  మనం ఏంటి,  మనం ఎలా ప్రవర్తిస్తున్నాం అన్న విషయం మర్చిపోయి క్రేజీగా ఫొటోలు తీసుకుని  అప్లోడ్ చేస్తూ ఉంటాం.  కేవలం  లక్షలాది మంది తమ వీడియోలు చూస్తే చాలు.. లైకులు, కామెంట్లు రాస్తే చాలు.. అనే ఓ  బలమైన మోటివేషన్ కొద్దీ చాలామంది మహిళలు అసభ్యకరమైన వీడియోలు టిక్ టాక్ లో చేస్తున్నారంటే కారణం వారికి డోపమిన్ స్థాయిలు  సరిపోవడం లేదు..
పరోక్షంగా అది అడిక్షన్ అయిపోయినట్లు గ్రహించాలి. మనం ఫేస్‌బుక్, వాట్సప్, మెసెంజర్ వంటి  సోషల్ మీడియా యాప్స్‌లో నవ్వుతూ ఉండే స్మైలీలు, హార్ట్ సింబల్స్ చూసినప్పుడు,  మనం బాగా దగ్గర అనుకుంటున్న వ్యక్తులు  మనకు పాజిటివ్‌గా  స్పందించినప్పుడు,  అలాగే ఆత్మీయుల నుండి మెసేజ్ వచ్చినప్పుడు తెలియకుండానే రివార్డ్ వచ్చిన  అనుభూతి కలిగి మెదడులో డోపమిన్  విడుదల అవుతుంది..
కావాలంటే మీకు మీరు గమనించండి. కొంతమంది వ్యక్తులు ఇచ్చే లైక్‌ల కన్నా  మీరు బాగా ఆత్మీయంగా  భావించేవారు  మీ ఫేస్బుక్ పోస్ట్‌కి కొట్టే ఒక లైక్  మీకు మరింత సంతోషాన్ని ఇస్తుంది. మీరెప్పుడు పోస్ట్ పెట్టినా వాళ్లు లైక్ కొట్టాలి అన్పిస్తుంది.  వాళ్ళు బిజీగా ఉండి ఎప్పుడైనా లైక్ కొట్టకపోతే..  ఒత్తిడి తట్టుకోలేక ఫోన్ చేసి “అర్జెంటుగా లైక్ కొట్టు” అని  చెప్పే వారు కూడా లేకపోలేదు!
                      *టెక్  కంపెనీల తెలివి*
ఈ రోజు మనం వాడుతున్న ఫేస్బుక్,  ఇంస్టాగ్రామ్,  వాట్సప్,  టిక్ టాక్, పబ్‌జీ వంటి అన్ని  రకాల అప్లికేషన్లు చాలా తెలివిగా డిజైన్ చేయబడ్డాయి.  అవి సక్సెస్ కావడం కోసం,  ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులు మిగతా అన్ని పనులు పక్కన పెట్టి అధిక సమయం వాటిమీద గడిపేలా ప్రేరేపించడం కోసం అవి తమ అల్గారిథమ్స్‌ని  వ్యూహాత్మకంగా తయారు చేసుకున్నాయి. 1930వ  సంవత్సరంలో వేరియబుల్ రివార్డ్ స్కెడ్యూల్స్ అనే  అంశం కనుగొనబడింది..
ఎలుకల మీద జరుపబడిన ప్రయోగంలో.. వాటి ఊహకి అందని వేర్వేరు సందర్భాల్లో వాటికి నజరానా అందించే విధంగా  ఏర్పాటు చేసినప్పుడు ఎలుకలు ఒకటే పని మళ్లీ మళ్లీ ఉత్సాహంగా చేయడం మొదలు పెట్టాయి. అదే  తమకు రివార్డ్ వస్తుంది అని  అవి ముందే ఊహించినప్పుడు అవి పెద్దగా స్పందించలేదు.  టెక్నాలజీ కంపెనీలు ఇదే వ్యూహాన్ని అనుసరిస్తాయి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: