బుల్లిపిట్ట: మనుషులకే కాదు ఇకపై భూములకు కూడా ఆధార్ తప్పనిసరి ..!
ఆధార్ కార్డ్ ఇది ఒక గుర్తింపు కార్డు. ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరిని గుర్తించే ఐడెంటిఫికేషన్ కార్డు. ఇప్పటివరకు ఇది కేవలం మనుషులకు మాత్రమే ఉన్నది. ఇకమీదట ఆధార్ కార్డ్ ను దేశంలోని భూములకు సైతం ఇవ్వడానికి సిద్ధమవుతోంది కేంద్ర ప్రభుత్వం . దేశ వ్యాప్తంగా ఉన్న ప్రతి స్థలం/ప్లాటుకు ఏడాదిలోగా ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది.
మనుషులకి ఆధార్ నెంబర్ లాగానే భూములకు కూడా 14 అంకెల ప్రత్యేక నెంబర్ ను కేటాయించనున్నారు. అదేవిధంగా భూమి రికార్డులు డేటాబేస్ ను ఆ తర్వాత రెవెన్యూ కోర్టు రికార్డులతో, బ్యాంకు రికార్డులతో అనుసంధానం చేయనున్నారు. అయితే లబ్ధిదారుల ఇష్టాఇష్టాలను బట్టి ఆధార్ నెంబర్ కూడా దీనికి అనుసంధానిస్తారు. పార్లమెంటులో గతవారం లోకసభ కు సమర్పించిన రిపోర్టులో ఈ విషయం వెల్లడించింది.
DILRMP (డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మాడర్నైజేషన్ ప్రోగ్రామ్) లో భాగంగా ఈ ప్రక్రియను చేపట్టనున్నారు. అయితే 2008 సంవత్సరంలోనే భూములకు ఆధార్ నంబర్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ ను ప్రారంభించింది. అంతేకాకుండా ఈ పథకం వచ్చే వారంలో ముగించాల్సి ఉండగా మరోసారి 2023-24 వరకు పొడిగించింది. భూములకు/ప్లాట్లకు కేటాయించిన ఈ నెంబరును 'యూనిక్ ల్యాండ్ పార్సెల్ ఐడెంటిఫికేషన్ నెంబర్'(యు ఎల్ టి ఐ ఎన్/అల్ల్ఫిన్) అని పేర్కొంటారు.
ఈ ప్రక్రియను ఇప్పటికే పది రాష్ట్రాలలో ప్రారంభించారని, వచ్చే ఏడాది మార్చి నాటికి దేశమంతటా చేపట్టనున్నారని, వనరుల విభాగం తమకు తెలిపిందని పార్లమెంటరీ స్థాయి సంఘం తన రిపోర్ట్ లో పేర్కొంది. అంతేకాకుండా భూ కుంభకోణం వంటివి నివారించేందుకు ఈ ప్రత్యేక గుర్తింపును ఇస్తున్నామని కేంద్ర ప్రభుత్వం చెప్పుకొచ్చింది. భూమి రేఖాంశం, అక్షాంశాల సమన్వయం ఆధారంగా, ఇదివరకే ఉన్న సమగ్ర సర్వే నివేదిక ఆధారంగా ఈ ఆధార్ నెంబర్ ను కేటాయిస్తామని తెలిపారు. ఏది ఏమైనా భూములకు కూడా ఆధార్ కార్డు ను పొందుపరచడం ఒక వరకు మంచిదేనని చెప్పవచ్చు. దీనివల్ల ఎవరికి భూమి నష్టం కలగకుండా ఉంటుంది. ముఖ్యంగా పేద వాడికి ఇది ఒక మంచి అవకాశం అని కూడా చెప్పవచ్చు.